రజినీ-రంజిత్.. మళ్లీ అదే చూపిస్తే ఎలా?

రజినీ-రంజిత్.. మళ్లీ అదే చూపిస్తే ఎలా?

‘కబాలి’ సినిమా విషయంలో జనాల అంచనాలు పూర్తిగా తప్పాయి. టీజర్ చూస్తే ఏదో ఊహించుకుంటే.. తెరమీద ఇంకేదో చూపించారు. ఎనర్జీకి మారుపేరైన రజినీ ఆ సినిమాలో అంత డల్లుగా కనిపించడం అభిమానులకు రుచించలేదు. దళిత సామాజిక వర్గానికి చెందిన దర్శకుడు పా.రంజిత్ తన ప్రతి సినిమాలోనూ ఆ వర్గం ప్రజలపై చూపించే వివక్ష.. వాళ్లకు జరిగే అన్యాయాల గురించి చెప్పడానికి ప్రయత్నిస్తాడు. రజినీ సినిమాలోనూ అది కొనసాగించాడు. నిమ్న వర్గాలపై అగ్ర వర్ణాల ఆధిపత్యం.. వీళ్ల పోరాటం.. గురించి అంతర్లీనంగా చెప్పడాన్ని గమనించవచ్చు. వివక్ష గురించి అందులో చాలా డైలాగులు కూడా ఉంటాయి.

‘కబాలి’కి ఎలాంటి ఫలితం దక్కినప్పటికీ.. తాను చెప్పాలనుకున్నది రంజిత్ బలంగానే చెప్పాడని ఒక వర్గం అభిప్రాయపడింది. ఐతే ఇప్పుడు ‘కాలా’లోనూ ఈ వివక్షకు సంబంధించిన నేపథ్యంలోనే సినిమా సాగేలా అనిపిస్తోంది. ‘కాలా’ టీజర్లో తన ఒంటి రంగు గురించి రజినీ డైలాగులు పేల్చడం తెలిసిందే. విలన్ పాత్రలో నానా పటేకర్.. రజినీ గురించి తక్కువ చేసి మాట్లాడటం.. రజినీ కౌంటర్లు వేయడం గమనించవచ్చు. ఇదంతా చూస్తే జనాలకు ‘కబాలి’నే గుర్తొస్తోంది. ఏమీ కొత్తగా అనిపించట్లేదు. ‘కబాలి’ సినిమా ఎలా ఉన్నప్పటికీ విడులకు ముందు కొత్తగా అనిపించి జనాల్లో క్యూరియాసిటీ పెంచింది. కానీ ‘కాలా’ అలాంటి ఫీలింగ్ తీసుకురాలేదు. ఇది ‘కబాలి’కి ఎక్స్‌టెన్షన్‌ లాగా అనిపించింది. అందుకే ఈ టీజర్‌కు రెస్పాన్స్ ఏమంత గొప్పగా లేదు.