సప్తగిరి తగ్గట్లేదుగా..

సప్తగిరి తగ్గట్లేదుగా..

గత కొన్నేళ్లలో చాలామంది కమెడియన్లు హీరోలుగా మారారు. వాళ్లలో కొంచెం ఎక్కువ ప్రభావం చూపిన వాళ్లలో సప్తగిరి ఒక్కడు. అతడి తొలి సినిమా ‘సప్తగిరి ఎక్స్‌ప్రెస్’ నెగెటివ్ టాక్‌తోనూ మంచి ఓపెనింగ్స్ తెచ్చుకుని బయ్యర్లకు లాభాలు తెచ్చిపెట్టింది. ఆ తర్వాత లేటెస్టుగా ‘సప్తగిరి ఎల్‌ఎల్‌బీ’తో పలకరించాడతను. ఐతే ఈ సినిమా ఆశించిన ఫలితాన్నివ్వలేదు. ఈసారి సప్తగిరి అండ్ కో చేసిన అతితో సినిమా కిచిడీ అయిపోయింది. సినిమా తేడా కొట్టేసింది. బయ్యర్లు నష్టపోయారు. అయినప్పటికీ సప్తగిరి ఏమీ ఆగట్లేదు. హీరోగా తన మూడో సినిమాకు తయారైపోతున్నాడు. ఈసారి కొంచెం ఎస్టాబ్లిష్డ్ డైరెక్టర్‌తో పని చేయబోతున్నాడు సప్తగిరి.

అల్లరి నరేష్‌ సినిమా ‘సిద్ధు ఫ్రమ్ శ్రీకాకుళం’తో దర్శకుడిగా పరిచయమై.. ఆ తర్వాత ‘సీతారాముల కళ్యాణం’.. ‘సెల్ఫీ రాజా’ సినిమాలు తీసిన ఈశ్వర్ దర్శకత్వంలో సప్తగిరి నటించబోతున్నాడు. ప్రముఖ రచయిత డైమండ్ రత్నబాబు ఈ చిత్రానికి డైలాగులు రాయనున్నాడు. విక్రమ్ రాజ్ అనే రచయిత ఈ చిత్రానికి కథ అందించాడు. హీరోగా సప్తగిరి తొలి రెండు సినిమాల్ని నిర్మించిన రవికిరణే ఈ చిత్రాన్ని కూడా నిర్మించే అవకాశాలున్నట్లు సమాచారం. అసిస్టెంట్ డైరెక్టర్‌గా అనుభవమున్న సప్తగిరి తన తొలి రెండు సినిమాల విషయంలో బాగా ఇన్వాల్వ్ అయ్యాడంటారు. ఐతే మూడో సినిమా విషయంలో తన జోక్యం తగ్గించి రైటర్లకే ఫ్రీ హ్యాండ్ ఇచ్చినట్లు కనిపిస్తున్నాడు. త్వరలోనే ఈ చిత్రం సెట్స్ మీదికి వెళ్లనుంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు