ఆర్జీవీపై మళ్లీ ఆ కుర్రాడి ఆరోపణలు

ఆర్జీవీపై మళ్లీ ఆ కుర్రాడి ఆరోపణలు

రామ్ గోపాల్ వర్మ మీద విమర్శలు కొత్తేమీ కాదు. ఎప్పుడూ ఎవరో ఒకరు ఆయన్ని తిట్టి పోస్తుంటారు. కానీ ఈ మధ్య కొత్తగా వర్మపై కాపీ ఆరోపణలు వస్తున్నాయి. పోర్న్ స్టార్ మియా మాల్కోవాను పెట్టి ఆర్జీవీ తీసిన ‘జీఎస్టీ’ కాన్సెప్ట్ మొత్తం తన బుక్ నుంచి కాపీ కొట్టిందే అంటూ వర్మ దగ్గర కొన్నాళ్ల పాటు రైటర్‌గా పని చేసిన జైకుమార్ అనే కుర్రాడు కొన్నాళ్ల కిందట ఆరోపించిన సంగతి తెలిసిందే.

ఐతే జైని జోకర్ అని విమర్శిస్తూ.. అతడికి, తనకు మధ్య ‘సర్కార్-3’ టైంలో సాగిన వాట్సాప్ సంభాషణను బయటపెట్టి అతడి గాలి తీసే ప్రయత్నం చేశాడు వర్మ. మొత్తానికి ‘జీఎస్టీ’ కాపీ వివాదం మీడియాలో పెద్ద టాపిక్ కాలేదు. ఆ గొడవ సద్దుమణిగిపోయింది.

ఐతే ఇప్పుడు జైకుమార్ మరోసారి వర్మ మీద ఆరోపణలు మొదలుపెట్టాడు. నాగార్జున హీరోగా వర్మ రూపొందిస్తున్న ‘ఆఫీసర్’ ఫస్ట్ లుక్ పోస్టర్ రెండు రోజుల కిందటే రిలీజైన సంగతి తెలిసిందే. ఈ పోస్టర్.. ఈ సినిమా కాన్సెప్ట్ గురించి వస్తున్న వార్తలు చూస్తుంటే వర్మ తన దగ్గరున్న మరో కథను కాపీ కొట్టాడేమో అనిపిస్తోందని జై కుమార్ ఆరోపించాడు.

ఈ విషయంలో తనకు బలంగా అనుమానాలున్నాయని.. అవసరమైతే నాగార్జునను కలిసి తన కథను వివరించి.. ‘ఆఫీసర్’కు దీనికి పోలికలున్నాయేమో అడుగుతానని జై కుమార్ చెబుతుండటం విశేషం. మరి ఈ ఆరోపణలపై వర్మ ఏమంటాడో చూడాలి. ఇదిలా ఉంటే.. ‘ఆఫీసర్’ హాలీవుడ్ క్లాసిక్ ‘టేకెన్’కు ఫ్రీమేక్ అంటూ ఒక ప్రచారం నడుస్తోంది ఇండస్ట్రీలో.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు