వ‌ర్మ ట్వీట్లు వ‌ర్ణ‌నాతీతం

వ‌ర్మ ట్వీట్లు వ‌ర్ణ‌నాతీతం

శ్రీదేవి అంద‌రికీ న‌టి... కానీ రామ్ గోపాల్ వ‌ర్మ‌కు దేవ‌త‌. ప‌దహారేళ్ల వ‌య‌సు సినిమాలో ఆమెను చూసి ప్రేమించ‌డం మొద‌లుపెట్టాడు. ఆమె కోస‌మే సినిమాల్లోకి వ‌చ్చాడు. ఆమెకు అంకిత‌మించ్చేలా క్ష‌ణ‌క్ష‌ణం సినిమా తీశాడు. గోవిందా గోవిందా సినిమాలో కేవ‌లం శ్రేదేవి అందాన్ని వ‌ర్ణంచ‌డానికే ఓరి బ్ర‌హ్మ‌దేవుడో... పాట‌ను తీశాడు. శ్రీదేవిని ప్రేమిస్తున్నానంటూ... ధైర్యంగా ప‌లుమార్లు చెప్పిన వ్య‌క్తి ఆర్జీవీ మాత్ర‌మే.

లోక‌మంతా ఏమైపోయినా... త‌న గురించి ఏమ‌నుకున్నా... శ్రీదేవి ఇద్ద‌రు పిల్ల‌ల త‌ల్లి అయినా... తాను ఎప్ప‌టికీ ఆమె ప్రేమికుడిన‌ని తేల్చి చెప్పేశాడు. ఆ అందాల దేవ‌త మ‌ర‌ణ వార్త మ‌న‌కు షాక్‌కు గురిచేస్తే... మ‌రి రామ్‌గోపాల్ వ‌ర్మ‌కు ఎలా ఉంటుంది? త‌న‌లోని ఆత్మ‌ను ఎవ‌రో బ‌ల‌వంతంగా బ‌య‌టికి లాగి ప‌డేసిన‌ట్టు ఫీల‌వుతున్నాడు ఆర్జీవీ. త‌న బాధ‌ను ట్వీట్ల రూపంలో కుమ్మ‌రించేస్తున్నాడు.

మొన్న‌టి జీఎస్టీ గొడ‌వ‌లో త‌డిసి ముద్ద‌య్యాడు ఆర్జీవీ. మియ మాల్కోవా అనే పోర్న్ స్టార్ జీవితాన్ని తీసి యూట్యూబ్ లో విడుద‌ల చేసి... అనేక కేసుల్లో చిక్కుకున్నాడు. ఆ కేసుల్లో స‌త‌మ‌త‌మ‌వుతుంటే... ఓ పెద్ద కుదుపులాంటి వార్త‌. అదే శ్రీదేవి మ‌ర‌ణం. దెబ్బ‌కి జీఎస్టీ సంగ‌తే మ‌ర్చిపోయాడు గురుడు. శ్రీదేవి... శ్రీదేవి అంటూ ట్విట్ట‌ర్‌లో నామ‌జ‌పం చేస్తున్నాడు. మొన్న‌టి వ‌ర‌కు శ్రీదేవి అందం గురించి మాత్ర‌మే మాట్లాడే జ‌నం... ఇప్పుడు ఆమె మ‌ర‌ణం గురించి... మాట్లాడ‌డం త‌న‌ను క‌లచి వేస్తోంద‌ని ఆవేద‌న ప‌డుతూ ట్వీట్ చేస్తున్నాడు.

ఆ ట్వీట్ల వ‌ర్షం రెండురోజులుగా కురుస్తూనే ఉంది.  దేవుడిని ఎన్న‌డూ ద్వేషించ‌నంత‌గా ఇప్పుడు ద్వేషిస్తున్నానంటూ ట్వీట్ చేశాడు. ఆమెతో కలిసి పనిచేసిన పాత జ్ఞాపకాలను నెమ‌రు వేసుకుంటున్నాడు. తన దృష్టిలో శ్రీదేవి ఇంకా చనిపోలేదని... బతికే ఉందని ట్వీట్ చేశాడు. అంతేకాదు ఆమె అంత్య‌క్రియ‌ల‌కు తాను వెళ్ల‌న‌ని స‌న్నిహితుల వ‌ద్ద చెప్పాడ‌ట కూడా.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు