ఆ రెండు వ్యాక్సిన్లతో గుండె సమస్యలు..?

Moderona

కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియను చేపడుతున్న సంగతి తెలిసిందే. అయితే.. రెండు వ్యాక్సిన్ల విషయంలో మాత్రం ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని యూరిపియన్ మెడికల్ ఏజెన్సీ పేర్కొంది.

ఫైజర్‌, మోడెర్నా టీకాలు తీసుకున్నవారిలో చాలా స్వల్ప స్థాయిలో గుండె కణజాలంలో వాపు వస్తున్నట్లు డాక్టర్లు గుర్తించినట్లు యూరోపియన్‌ వైద్య నియంత్రణాధికారులు తెలిపారు. యురోపియన్‌ మెడిసిన్స్‌ ఏజెన్సీ అధికారులు మాట్లాడుతూ… చాలా సాధారణంగా ఫైజర్‌, మోడెర్నా టీకాలు తీసుకున్న పురుషుల్లో స్వల్పంగా గుండె కణాల్లో వాపు కనిపిస్తున్నట్లు తెలిపారు. అయినప్పటికీ కోవిడ్‌ వ్యాక్సిన్‌ వల్ల ఎక్కువ స్థాయిలో లాభం జరుగుతుందన్నారు. ఆ రెండు టీకాలు తీసుకునేవారిలో గుండె కణాల్లో వాపు వస్తున్న కారణంగా రోగులు, డాక్టర్లు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.

ఫైజర్‌, మోడెర్నా టీకాలు తీసుకున్నవారిలో కొంతమందికి ఛాతి నొప్పి, శ్వాస ఆడకపోవడం, గుండె మంట లాంటి లక్షణాలు నమోదయినట్లు యురోపియన్‌ ఏజెన్సీ తెలిపింది. ఇలాంటి లక్షణాలు ఉన్నవారు కచ్చితంగా డాక్టర్లను సంప్రదించాలని సూచించింది. ఫైజర్‌ టీకా తీసుకున్న 17.7 కోట్ల మందిలో.. 145 మందికి మయోకార్డిటిస్‌, 138 మందిలో పెరికార్డిటిస్‌ లాంటి లక్షణాలు కనిపించినట్లు అధికారులు చెప్పారు.

మోడెర్నా టీకా తీసుకున్న 2 కోట్ల మందిలో 19 మయోకార్డిటిస్‌, 19 పెరీకార్డిటిస్‌ కేసులు నమోదు అయ్యాయని యురోపియన్‌ ఏజెన్సీ వెల్లడించింది. కోవిడ్‌ వ్యాక్సిన్‌ తీసుకున్న 14 రోజుల్లో మయోకార్డిటిస్‌ లక్షణాలు కనిపించే అవకాశముందన్నారు. ఎంఆర్‌ఎన్‌ఎ టెక్నాలజీతో తయారైన ఈ వ్యాక్సిన్‌లను వేసుకున్నవారిలో గుండె కణాల్లో వాపును గుర్తించినట్లు డాక్టర్లు తెలిపారు. ఆస్ట్రాజెనికా, జాన్సన్‌ టీకాలతో ఆ సమస్య లేదని స్పష్టం చేశారు.