రూటు మార్చేసిన అందాలరాశి

రూటు మార్చేసిన అందాలరాశి

ఊహలు గుసగుసలాడే చిత్రంలో పక్కింటి అమ్మాయి తరహా పాత్రలో మనసులు దోచుకున్న రాశి ఖన్నా స్టార్‌డమ్‌ కోసమని మసాలా సినిమాల బాట పట్టింది. అందాల ప్రదర్శన చేస్తూ జోరుగా చాలా సినిమాలే చేసింది. రవితేజ, ఎన్టీఆర్‌లాంటి హీరోలతో జత కట్టే అవకాశమయితే వచ్చింది కానీ మళ్లీ మొదటి సినిమాకి వచ్చిన మన్ననలు మాత్రం దక్కలేదు.

చాలా కాలం తర్వాత రాశికి 'తొలిప్రేమ'తోనే ప్రశంసలు దక్కాయి. ఈ చిత్రంలో నటనకి చాలా స్కోప్‌ వున్న పాత్రలో రాశి నటన చాలా బాగుంది. ఈ చిత్రానికి వచ్చిన గుర్తింపుతో రాశి ఆలోచనలో మార్పు వచ్చిందట. గ్లామర్‌ పాత్రల కోసం చూడకుండా, ఇలాంటి పాత్రలు చేస్తానని అంటోందట. తనకి వచ్చిన ఒకటి, రెండు మాస్‌ సినిమా ఆఫర్లని కూడా రాశి ఇదే కారణమ్మీద తోసిపుచ్చిందట.

అయితే ఇలా వచ్చిన అవకాశాలని వదిలేసుకుంటే, తొలిప్రేమలాంటి అవకాశాలు హీరోయిన్లకి ఎప్పుడో కానీ రావు కనుక రాశికి అవకాశాలు తగ్గే ప్రమాదముంది. మాస్‌ సినిమాల్లోను తన పాత్రకి ప్రాధాన్యత వుండేట్టు చూసుకుంటే బాగుంటుందేమో. అసలే స్టార్‌ హీరోయిన్ల కొరత బాగా వున్న టైమ్‌లో మడి కట్టుకుని కూర్చోవడం తెలివైన పని కాదేమో కదూ.