నాగశౌర్యతో గొడవపై సాయిపల్లవి ఏమందంటే..

నాగశౌర్యతో గొడవపై సాయిపల్లవి ఏమందంటే..

సినిమా షూటింగ్ సందర్భంగా హీరో హీరోయిన్ల మధ్య చిన్న పాటి విభేదాలు తలెత్తడం మామూలే. అవి చాలా వరకు అక్కడే సమసిపోతుంటాయి. ఆ వ్యవహారాలు బయటికి రావు. అలా కాకుండా ఆ గొడవల గురించి ఎవరైనా మీడియా ముందు ఓపెన్ అయ్యారంటే గొడవ కొంచెం పెద్ద స్థాయిలో జరిగినట్లే. ‘కణం’ సినిమా షూటింగ్ సందర్భంగా హీరో నాగశౌర్య, హీరోయిన్ సాయిపల్లవి మధ్య గొడవ అలాంటిదే అనుకున్నారు చాలామంది. ఒక టీవీ కార్యక్రమంలో భాగంగా మిమ్మల్ని బాగా ఇరిటేట్ చేసిన నటి ఎవరంటే.. ఏం సందేహించకుండా సాయిపల్లవి పేరు చెప్పేశాడు శౌర్య. అంతే కాక మరో ఇంటర్వ్యూలోనూ సాయిపల్లవి వల్ల ఇబ్బంది ఎదురైనట్లు కుండబద్దలు కొట్టేశాడతను.

దీనిపై తాజాగా ఒక ఇంటర్వ్యూలో సాయిపల్లవి స్పందించింది. తాను శౌర్య ఇంటర్వ్యూ చదివానని.. వెంటనే దర్శకుడు విజయ్‌కి కాల్ చేసి మాట్లాడానని ఆమె చెప్పింది. ఐతే విజయ్ మాత్రం దీని గురించి తనకు ఏ సమాచారం లేదని.. సెట్‌లో ఇబ్బందికరంగా ఏమీ జరగలేదని స్పష్టం చేశాడని సాయిపల్లవి తెలిపింది. సినిమాటోగ్రాఫర్ నిరవ్ షా సైతం ఇదే మాట అన్నాడని.. తన గురించి వేరొకరు ఇలాంటి మాట చెబితే తనకు కచ్చితంగా బాధగా ఉంటుందని ఆమె చెప్పింది. తాను శౌర్యను హర్ట్ చేసి ఉంటే ఆ విషయంలో చింతిస్తున్నానని సాయిపల్లవి అంది. ఐతే ఒక సినిమా షూటింగ్ సందర్భంగా ఏదైనా ఇబ్బంది తలెత్తితే కెప్టెన్ ఆఫ్ ద షిప్ అయిన దర్శకుడి దగ్గర చెప్పాల్సిందని.. అప్పుడే ఏ ఇబ్బందీ లేకుండా షూటింగ్ సాగుతుందని.. తానైతే ఎవరినీ హర్ట్ చేయాలని అనుకోనని చెప్పింది. ఇవన్నీ చెప్పిన సాయిపల్లవి.. చివరగా శౌర్య మంచి నటుడంటూ కితాబిచ్చి ముగించడం విశేషం. ఐతే శౌర్య ఇంటర్వ్యూ చూశాక దర్శకుడికి, సినిమాటోగ్రాఫర్‌లకు ఫోన్ చేసే బదులు నేరుగా శౌర్యతోనే మాట్లాడిత సమస్య ఈజీగా సాల్వ్ అయిపోయేది కదా?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు