ఐఏఎస్ శ్రీలక్ష్మికి హైకోర్టు బిగ్ రిలీఫ్..!

ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మికి భారీ రిలీఫ్ లభించింది. ఓఎంసీ చార్జిషీట్‌పై విచారణ ఆపాలని ఆమె వేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన తెలంగాణ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. శ్రీలక్ష్మిపై కఠిన చర్యలు తీసుకోవద్దని సీబీఐ కోర్టును ఆదేశించింది.

సరిహద్దు వివాదంపై దర్యాప్తు పూర్తయ్యే వరకు విచారణ ఆపాలని శ్రీలక్ష్మి తరఫు న్యాయవాది కోరారు. ఓఎంసీ కేసు దర్యాప్తు పూర్తయిందని… మరో ఛార్జ్ షీట్‌ వేయబోమని సీబీఐ హైకోర్టుకు తెలిపింది. దర్యాప్తు అధికారి వాంగ్మూలాన్ని సీబీఐ కోర్టు ఇప్పటికే పరిగణనలోకి తీసుకుందని చెప్పింది. అయితే మౌఖికంగా చెబితే సరిపోదని, లిఖితపూర్వకంగా సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది.

దీంతో అప్పటి వరకు సీబీఐ కోర్టులో తనపై విచారణ ఆపాలని శ్రీలక్ష్మి కోరారు. వాదనలు వినిపించనందుకు సీబీఐ కోర్టు ఇప్పటికే రూ.4వేలు జరిమానా విధించిందని అన్నారు. ఈనెల 12న వాదనలు వినిపించకపోవతే డిశ్చార్జ్ పిటిషన్‌పై నిర్ణయం తీసుకుంటామని సీబీఐ కోర్టు తెలిపిందని చెప్పారు. దీనిపై స్పందించిన న్యాయస్థానం.. శ్రీలక్ష్మిపై కఠిన చర్యలు తీసుకోవద్దని సీబీఐ కోర్టుకు మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది.