అయ్యో వర్మ.. పాపం బోనీ అనరే

అయ్యో వర్మ.. పాపం బోనీ అనరే

ఒక వ్యక్తి చనిపోతే ముందు వాళ్ల కుటుంబ సభ్యుల గురించి ఎవరికైనా బాధ ఉంటుంది. ఆ వ్యక్తి లేని లోటుతో వాళ్లు ఎంత బాధపడుతారో.. ఆ బాధ నుంచి ఎప్పటికి బయటపడతారో.. వాళ్ల పరిస్థితి మున్ముందు ఎలా ఉంటుందో అని అందరూ ఆలోచిస్తారు. ఐతే అతిలోక సుందరి శ్రీదేవి చనిపోతే మాత్రం చాలామంది ఆలోచన రామ్ గోపాల్ వర్మ మీదికి మళ్లడమే విచిత్రం. శ్రీదేవికి కోట్లాది మంది వీరాభిమానులున్నారు. ఆమె ఆరాధకులకు లెక్కే లేదు.

కానీ అందర్లోకి గొప్ప ఆరాధకుడిగా.. వీరాధివీరాభిమానిగా వర్మనే పరిగణిస్తారందరూ. శ్రీదేవిపై తన అభిమానాన్ని ఆ స్థాయిలో చాటుకున్నాడు వర్మ. ‘నా ఇష్టం’.. ‘గన్స్ అండ్ థైస్’ పుస్తకాల్లో కావచ్చు.. అనేక ఇంటర్వ్యూల్లో కావచ్చు.. శ్రీదేవి గురించి వర్మ చెప్పిన మాటలు అబ్బురంగా అనిపిస్తాయి. అందుకే శ్రీదేవి చనిపోగానే.. వర్మ పరిస్థితి ఏంటో అని అందరూ ఆలోచించారు. వర్మ కూడా శ్రీదేవిపై తన అమితమైన ప్రేమను నిన్నంతా గొప్పగానే చాటుకున్నాడు. ఐతే వర్మ లాంటి వ్యక్తికి శ్రీదేవి మరణం నుంచి కోలుకోవడం కష్టమా? అసలు శ్రీదేవితో వ్యక్తిగతంగా వర్మకు ఏం అనుబంధం ఉంది..? ఆమె అందాన్ని, అభినయాన్ని ఆరాధించాడతను. అంతే.

కానీ శ్రీదేవి భర్త.. ఆమె కుటుంబ సభ్యుల సంగతలా కాదు కదా? పాతికేళ్లకు పైగా శ్రీదేవితో కలిసి జీవితాన్ని పంచుకున్నాడు బోనీ కపూర్. వీరి పిల్లలు ఇప్పుడు యవ్వనంలో ఉన్నారు. ఒకరు సినీ రంగంలో తొలి అడుగులకు సిద్ధమవుతుంటే.. ఇంకొకరు కూడా అరంగేట్రానికి సిద్ధమవుతున్నారు. ఈ సమయంలో వాళ్లకు తల్లి అవసరం చాలా ఉంది. బోనీకి కూడా భార్య తోడు చాలా చాలా అవసరం. ఇలాంటి సమయంలో కుటుంబంతో ఎంతో అటాచ్మెంట్ ఉన్న శ్రీదేవి వాళ్లను విడిచిపోవడం మామూలు దెబ్బ కాదు. గత రెండు దశాబ్దాల్లో బోనీ కపూర్ ఒంటరిగా కనిపించడం అరుదు. ఎప్పుడూ శ్రీదేవి ఆయన వెన్నంటే ఉండేది. అలాంటి తోడును దూరం చేసుకున్న బోనీ గురించి కాకుండా వర్మ గురించి జనాలు బాధపడిపోతుండటం విడ్డూరమే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు