శ్రీదేవి మిస్సయిన సిల్వర్ జూబ్లీ సినిమా

శ్రీదేవి మిస్సయిన సిల్వర్ జూబ్లీ సినిమా

ఒక దర్శకుడితో లేదా ఒక హీరోతో ఒక హీరోయిన్ రెండు మూడు సినిమాలు చేస్తేనే ఆశ్చర్యపోతున్నాం. కానీ ఒకప్పటి హీరోయిన్లు ఒక హీరోతో రెండంకెల సినిమాల్లో జత కట్టేవాళ్లు. ఒక హీరోతోనే 10-20 సినిమాలు చేసేవాళ్లు. అతిలోక సుందరి శ్రీదేవి చాలామంది హీరోలు.. దర్శకులతో రెండంకెల సంఖ్యలో సినిమాలు చేసింది.

ఒక్క రాఘవేంద్రరావు దర్శకత్వంలోనే ఆమె 24 సినిమాల్లో నటించడం విశేషం. శత చిత్రాల దర్శకుడు రాఘవేంద్రరావు తన కెరీర్లో నాలుగో వంతు సినిమాల్లో శ్రీదేవినే కథానాయికగా పెట్టుకున్నారు. 80వ దశకంలో రాఘవేంద్రరావు ఏ హీరోతో సినిమా చేసినా కథానాయిక మాత్రం శ్రీదేవే అయ్యేది. ఆమెతో ఎన్నో సూపర్ హిట్స్.. బ్లాక్ బస్టర్లు ఇచ్చాడు దర్శకేంద్రుడు.

ఐతే వీళ్లిద్దరి కాంబినేషన్లో ఇంకొక్క సినిమా వచ్చి ఉంటే సిల్వర్ జూబ్లీ పూర్తయి ఉండేది. ఆ ఒక్క సినిమా చేయనందుకు ‘సౌందర్య లహరి’ కార్యక్రమంలో ఇద్దరూ చాలా ఫీలయ్యారు. కుదిరితే కచ్చితంగా మరో సినిమా చేసి సిల్వర్ జూబ్లీ పూర్తి చేస్తామన్నారు వీళ్లిద్దరూ ఆ కార్యక్రమంలో. ఐతే కొంత కాలం కిందట శ్రీదేవితో రాఘవేంద్రరావు సిల్వర్ జూబ్లీ సినిమా చేయడానికి అంగీకారం కుదిరిందట.

మోహన్ బాబు హీరోగా ‘రావణ’ సినిమా చేసే ప్రపోజల్ రాఘవేంద్రరావు ముందుకొచ్చింది. ఆ చిత్రాన్ని భారీ స్థాయిలో వంద కోట్లకు పైగా బడ్జెట్‌తో తెరకెక్కించాల్సి ఉండటంతో అది కొంచెం ఆలస్యమైంది. ఐతే ఆ సినిమా ఎప్పుడు చేసినా అందులో శ్రీదేవికి ఒక పాత్ర ఇవ్వాలని.. తద్వారా సిల్వర్ జూబ్లీ పూర్తి చేయాలని అనుకున్నారట దర్శకేంద్రుడు. ఇందుకు శ్రీదేవి నుంచి కూడా అంగీకారం వచ్చిందట. కానీ ఇంతలోనే శ్రీదేవి కాలం చేసింది. దర్శకేంద్రుడితో ఆమె సిల్వర్ జూబ్లీ మిస్సయింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు