తొలి ప్రేమ లాగుతూనే ఉంది

 తొలి ప్రేమ లాగుతూనే ఉంది

రిపబ్లిక్ డే వీకెండ్ నుంచి తెలుగులో ప్రతి వారం ఒక హిట్ సినిమా పడుతూ వచ్చింది. ఐతే ఆ విన్నింగ్ స్ట్రీక్‌కు ఫిబ్రవరి మూడో వీకెండ్‌తో బ్రేక్ పడింది. ఆ వారం వచ్చిన ‘అ!’ సినిమా ఓ మోస్తరుగా ఆడి.. పెట్టుబడిని వెనక్కి తేవడం ద్వారా హిట్ అనిపించుకుంది. కానీ గత వారాంతంలో వచ్చిన సినిమాలన్నీ తుస్సుమనిపించాయి.

‘అ!’ సినిమా పెట్టుబడి వెనక్కి తేగలిగింది కానీ.. మామూలుగా చూస్తే దాని వసూళ్లు అంత గొప్పగా ఏమీ లేవు. అది పెద్ద ఎత్తున జనాల్ని థియేటర్లకు రప్పించలేకపోయింది. ముందు వారం వచ్చిన ‘తొలి ప్రేమ’ సినిమానే మూడో వారంలోనూ హవా సాగించింది. ఇక గత వారాంతంలో వచ్చిన సినిమాలన్నీ తేలిపోవడం కూడా ‘తొలి ప్రేమ’కు బాగా కలిసొచ్చింది.

‘తొలి ప్రేమ’ రిలీజైన రోజు నుంచి అదే బాక్సాఫీస్ లీడర్‌గా కొనసాగుతోంది. తర్వాతి రెండు వారాంతాల్లోనూ దీనికి మంచి వసూళ్లే వచ్చాయి. ప్రస్తుతం ఇటు తెలుగు రాష్ట్రాల్లో.. అటు అమెరికాలో ఎక్కువ వసూళ్లు రాబడుతున్నది ‘తొలి ప్రేమ’ చిత్రమే. దీనికి మిగతా సినిమాలకు అంతరం చాలా ఉంది. మెజారిటీ ప్రేక్షకులకు నచ్చేలా ఈ చిత్రం ఉండటంతో మూడో వారంలోనూ థియేటర్లు కళకళలాడుతున్నాయి.

నిన్న ఆదివారం ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో పరిస్థితి చూస్తే.. మిగతా సినిమాలన్నీ కలిపి ఎంత వసూళ్లు రాబట్టాయో.. దాదాపుగా అంతే స్థాయిలో ‘తొలి ప్రేమ’ కలెక్షన్లు ఉండటం విశేషం. వీకెండ్లో 60-70 శాతం ఆక్యుపెన్సీతో నడుస్తోందీ సినిమా. ఈ చిత్ర షేర్ ఇప్పటికే రూ.25 కోట్లు దాటింది. ఫుల్ రన్లో ఈ సినిమా రూ.30 కోట్ల మార్కును అందుకునే అవకాశాలు కూడా ఉన్నాయి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు