దిల్‌ రాజు నీడలోంచి బయటకి..!

దిల్‌ రాజు నీడలోంచి బయటకి..!

దిల్‌ రాజు కాంపౌండ్‌కే చాలా కాలంగా అంకితమైపోయిన దర్శకులు ఒక్కొక్కరే నెమ్మదిగా ఇప్పుడు బయటకి వస్తున్నారు. వరుసగా దిల్‌ రాజుకే సినిమాలు చేసి పెడ్తోన్న హరీష్‌ శంకర్‌ తదుపరి చేసే 'దాగుడుమూతలు' తర్వాత దిల్‌ రాజు కాంపౌండ్‌నుంచి బయటకి వస్తున్నాడు. 'సీటీమార్‌' చిత్రాన్ని కృష్ణ నిర్మాణంలో చేస్తానని హరీష్‌ ప్రకటించాడు. అయితే ఈ కృష్ణ కంప్లీట్‌గా దిల్‌రాజుకి అవుట్‌సైడర్‌ కాదు.

అతను నిర్మించిన జవాన్‌ చిత్రానికి సమర్పకుని బాధ్యతల్ని దిల్‌ రాజే నిర్వర్తించాడు. మరి 'సీటీమార్‌'కి కూడా ఆ అసోసియేషన్‌ కొనసాగుతుందా లేదా అనేది చూడాలి. ఇకపోతే దిల్‌ రాజు కాంపౌండ్‌లోనే కాలక్షేపం చేస్తోన్న అనిల్‌ రావిపూడి కూడా బయటకి అడుగుపెడుతున్నాడు. పటాస్‌ చిత్రాన్ని రిలీజ్‌ చేయడం దగ్గర్నుంచి సుప్రీమ్‌, రాజా ది గ్రేట్‌ నిర్మించడం వరకు దిల్‌ రాజే చేసాడు. అనిల్‌ తదుపరి చిత్రం కూడా దిల్‌ రాజు బ్యానర్లోనే వుంటుందని సమాచారం. ఆ తర్వాత మాత్రం సి.కళ్యాణ్‌ నిర్మాణంలో బాలకృష్ణ హీరోగా ఒక సినిమా చేస్తాడట.

బాలయ్య మాస్‌ ఇమేజ్‌కి తగ్గ సూపర్‌ ఎంటర్‌టైనర్‌ అనిల్‌ రావిపూడి వద్ద సిద్ధంగా వుందట. గతంలోనే ఈ కథ విని బాలయ్య గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్టు వార్తలొచ్చాయి. అయితే ఇంతలో గౌతమిపుత్ర శాతకర్ణి, పైసావసూల్‌ చిత్రాలతో బాలయ్య బిజీ అయిపోవడంతో ఈ ప్రాజెక్ట్‌ వెనక్కి వెళ్లింది. ఇలాంటి ఆస్థాన దర్శకులు దిల్‌ రాజు వద్ద ఒక అరడజను మంది వరకు వున్నారు. వారంతా కూడా బాహ్య ప్రపంచంలోకి వస్తారో లేక శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌లోనే కాలక్షేపం చేసేస్తుంటారో వేచి చూడాల్సిందే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు