‘మామ్’గా మురిపించి వెళ్లిపోయింది

‘మామ్’గా మురిపించి వెళ్లిపోయింది

బాల నటిగా ప్రతిభ చాటుకుని.. టీనేజీలోనే దక్షిణాదిన స్టార్ హీరోయిన్ అయిన శ్రీదేవి.. తెలుగు, తమిళ సినీ ప్రేక్షకుల్ని ఒక ఊపు ఊపాక బాలీవుడ్లో పాగా వేసింది. అక్కడా తిరుగులేని పేరు, ఫాలోయింగ్ సంపాదించింది. రెండు దశాబ్దాల పాటు మొత్తం ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో హవా సాగించిన అతిలోక సుందరి చివరగా 1997లో సూపర్ హిట్ మూవీ ‘జుడాయ్’లో నటించి సినిమాలకు టాటా చెప్పింది. బోనీ కపూర్‌ను పెళ్లి చేసుకుని వ్యక్తిగత జీవితంలో స్థిరపడ్డాక ఆమె సినిమాల వైపు చూడలేదు. మధ్యలో టీవీ సీరియల్ ‘మాలిని అయ్యర్’లో, ఇతర టీవీ షోల్లో కనిపించినప్పటికీ.. ఆమె సినిమాల్లో మాత్రం నటించలేదు. ఎన్ని అవకాశాలొచ్చినా నో అనే చెప్పింది.

ఎట్టకేలకు 2012లో ‘ఇంగ్లిష్ వింగ్లిష్’తో ఆమె రీఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమాలో అద్భుతమైన పెర్ఫామెన్స్‌తో తన స్థాయి ఏంటో చాటి చెప్పింది. ఆ సినిమా అనేక అవార్డులు, రివార్డులు అందుకుంది. పలు దేశాల్లో మంచి ఆదరణ పొందింది. ఆపై తమిళంలో విజయ్ హీరోగా తెరకెక్కిన ‘పులి’లో ఓ కీలక పాత్రలో నటించింది. ఆ సినిమా ఆమెకు చేదు అనుభవం మిగిల్చింది. దీని కంటే ముందు ఆమె రాజమౌళి విజువల్ వండర్ ‘బాహుబలి’లో నటించాల్సింది కానీ.. కొన్ని కారణాల వల్ల కుదర్లేదు. చివరగా గత ఏడాది శ్రీదేవి ‘మామ్’ సినిమాతో మళ్లీ ప్రేక్షకుల్ని పలకరించింది. ఈ చిత్రం నటిగా శ్రీదేవి కెరీర్లో మరో మైలురాయిగా నిలిచింది. కమర్షియల్‌గా ఈ సినిమా పెద్ద సక్సెస్ కాకపోయినప్పటికీ క్రిటికల్ అక్లైమ్ అందుకుంది. శ్రీదేవి నటనకు ప్రశంసలు దక్కాయి. దీని తర్వాత శ్రీదేవి నటించాల్సిన రెండు మూడు సినిమాలు చర్చల దశలో ఉన్నాయి కానీ.. ఆమె వాటిని పక్కన పెట్టి తన కూతురి అరంగేట్రం మీద దృష్టిపెట్టింది. ఈలోపు ఘోరం జరిగిపోయింది. చివరగా ‘మామ్’ సినిమాతో బలమైన ముద్రే వేసి వెళ్లిపోయింది శ్రీదేవి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English