దేవీ మౌనమా..

దేవీ మౌనమా..

భార‌తీయ వెండితెర వేలుపు, ప్రత్యేకించి దక్షిణాది సినీ ప్రేక్షక యువ హృద‌యాలను గిలిగింతలు పెట్టిన అతిలోక సుందరి అయిన శ్రీదేవి ఇప్పుడు అవే హృదయాలను మెలి తిప్పేశారు. దశాబ్దాలుగా తన అందం, అభినయంతో ఆనందం, అభిమానం పంచిన ఆమె ఇప్పుడు ఆవేదన మిగిల్చి వెళ్లిపోయారు.

ఎన‌భయ్యో ద‌శ‌కంలో ద‌క్షిణాది వెండితెర‌మీద శ్రీదేవిది ఒక తిరుగులేని ప్రస్థానం. అది ఆమె యుగం. తెలుగు, త‌మిళ, మ‌ల‌యాళ భాష‌ల్లో దాదాపు అంద‌రి అగ్ర క‌థానాయ‌కుల స‌ర‌స‌న న‌టించి ఎవ‌ర్ గ్రీన్ పాపులారిటీ తెచ్చుకున్నారు శ్రీదేవి. ఆ తర్వాత బాలీవుడ్ లోనూ ఆమె శకం ప్రారంభ‌మైంది. అక్క‌డ కూడా అంద‌రి అగ్ర‌క‌థానాయ‌కుల స‌ర‌స‌న న‌టించి ఎన‌లేని కీర్తి ప్ర‌తిష్ట‌లు తెచ్చుకుంది శ్రీదేవి. ఇటు గ్లామ‌ర్ ప‌రంగానూ, అటు పెర్ఫార్మెన్స్ ప‌రంగానూ శ్రీదేవి భార‌తీయ వెండితెర‌మీద తిరుగులేని స్టార్ డ‌మ్ ను సంపాదించుకున్నారు.

తమిళనాడులోని శివకాశిలో  జన్మించిన శ్రీదేవి తొలి సారిగా వెండితెరపై బాలనటిగా అడుగుపెట్టారు. కన్దన్ కరుణాయ్ అనే చిత్రంలో బాలనటిగా శ్రీదేవి మెరిసారు . ఆమె అసలు పేరు శ్రీ అమ్మయ్యంగార్‌ అయ్యప్పన్‌  1976లో కె.బాలచందర్‌ దర్శకత్వం వహించిన ‘మాండ్రు ముడిచు’లో కమల్‌ హాసన్‌, రజనీకాంత్‌లతో కలిసి నటించి స్టార్‌ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్నారు. తెలుగులో ‘పదహారేళ్ల వయసు’, హిందీలో ‘సోల్వా సావన్‌’.. హీరోయిన్‌గా ఆమెకు తొలి చిత్రాలు. ఆ తర్వాత తెలుగు, తమిళం, హిందీలో వరుస సినిమాల్లో నటించారు.  1975 నుంచి దశాబ్దం పాటు ఆమె తెలుగు, తమిళం చిత్రాలలో తిరుగులేని నటిగా నిలిచారు.

1971 లోనే శ్రీదేవి ఉత్త‌మ బాల‌న‌టిగా కేర‌ళ స్టేట్ అవార్డు ను సొంతం చేసుకున్నారు. తెలుగులో 62 చిత్రాల్లోనూ, త‌మిళంలో 58, హిందీలో  63, మ‌ల‌యాళంలో 21 చిత్రాల్లోనూ న‌టించిన శ్రీదేవి క‌న్న‌డ‌లో కూడా కొన్ని చిత్రాల్లో న‌టించారు. కె. బాల‌చంద‌ర్, భార‌తిరాజా, దాస‌రి నారాయ‌ణ‌రావు, రాఘవేంద్ర‌రావు, తాతినేని రామారావు, కె.బాప‌య్యల‌తో పాటు మిగిలిన భాష‌ల్లో సైతం స్టార్ ద‌ర్శ‌కుల చిత్రాల్లో శ్రీదేవి న‌టించారు. వీటిలో చాలా సినిమాలు బ్లాక్ బ‌స్ట‌ర్స్ అయి చ‌రిత్ర‌లో నిలిచిపోయాయి. ఇక అమితాబ్ , ర‌జినీ కాంత్, క‌మ‌ల్ హాస‌న్, చిరంజీవి, విష్ణువ‌ర్ధ‌న్  హిందీ, తమిళ, తెలుగు, కన్నడ సూపర్ స్టార్లు అందరితోనూ నటించి రికార్డు నెలకొల్పారు.

తెలుగులో బాల‌న‌టిగా దాదాపు 10 చిత్రాల్లో న‌టించిన శ్రీదేవి, ద‌క్షిణాది వెండితెర‌మీద అగ్ర‌ క‌థానాయికగా ఓ వెలుగు వెలిగారు. త‌మిళ్ లో కె.బాల‌చందర్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన మూండ్రు ముడిచ్చు చిత్రంతో తొలిసారి శ్రీదేవి లీడ్ రోల్ లో న‌టించారు. ఇక శ్రీదేవి 1975 లో ‘జూలి’ చిత్రంతో బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది. శ్రీదేవి, క‌మ‌ల్ హాస‌న్ సౌత్ స్ర్కీన్ మీద హిట్ జంట‌గా పేరు తెచ్చుకున్నారు. 1996 నుంచి బాలీవుడ్ లో అనిల్ క‌పూర్, శ్రీదేవి హిట్ పెయిర్ గా పేరు తెచ్చుకున్నారు. బాలీవుడ్ లో అత్య‌ధిక పారితోషికం తీసుకున్న న‌టిగా శ్రీదేవి రికార్డుల‌కెక్కారు. బాలీవుడ్ లో ప్ర‌వేశించే నాటికి అస‌లు శ్రీదేవికి హిందీ కూడా స‌రిగ్గా రాదు. 1989 లో విడుద‌లైన చాందిని సినిమా ద్వారా శ్రీదేవి హిందీలో త‌న పాత్ర‌కు త‌నే డ‌బ్బింగ్ చెప్పుకోవ‌డం ప్రారంభించింది.  బాలీవుడ్ లో లెక్క‌కు మించిన చిత్రాల్లో న‌టించి  నెం. 1 క‌థానాయిక‌గా ఓ వెలుగు వెలిగిన శ్రీదేవి బోనిక‌పూర్ ను పెళ్లి చేసుకొని సినీజీవితానికి తాత్కాలికంగా గుడ్ బై చెప్పారు . 2012 లో ఇంగ్లీష్-వింగ్లీష్ తో తిరిగి బాలీవుడ్ లో రీ ఎంట్రీ ఇచ్చారు శ్రీదేవి.  ఆ త‌ర‌వాత శ్రీదేవి మ‌ళ్లీ త‌మిళ్ లో  ‘పులి’ చిత్రంలో ఓ ప్ర‌ధాన పాత్ర పోషించారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు