కొత్త సినిమాలా.. కష్టం బాబోయ్

 కొత్త సినిమాలా.. కష్టం బాబోయ్

సంక్రాంతి సినిమాలు నిరాశ పరిచినప్పటికీ రిపబ్లిక్ డే వీకెండ్ నుంచి టాలీవుడ్ బాక్సాఫీస్‌కు కొంత కళ వచ్చింది. గణతంత్ర దినోత్సవాన రిలీజైన అనుష్క సినిమా ‘భాగమతి’ మంచి విజయం సాధించింది. ఆ తర్వాతి వారాల్లో వరుసగా ‘ఛలో’.. ‘తొలిప్రేమ’.. ‘అ!’ సినిమాలు వాటి వాటి స్థాయిలో బాగానే ఆకట్టుకున్నాయి. వరుసగా నాలుగు వారాల్లో నాలుగు సక్సెస్ ఫుల్ సినిమాలు వచ్చాయి. ఇలా జరగడం అరుదైన విషయమే. కానీ ఆ విన్నింగ్ స్ట్రీక్ ఐదో వారంలో కొనసాగలేదు. ఈ వారాంతంలో పెద్దగా అంచనాల్లేకుండా రిలీజైన కొత్త సినిమాలు ఏవీ కూడా సర్ప్రైజ్ చేయలేకపోయాయి. అసలే ఈ సినిమాలపై ఆసక్తి అంతంతమాత్రమే అంటే.. వాటి టాక్ కూడా ఏమంత బాగా లేదు.

ఉన్నంతలో ఈ వీకెండ్లో జనాల దృష్టిని ఎక్కువ ఆకర్షించింది తమిళ డబ్బింగ్ సినిమా ‘స్కెచ్’ అనే చెప్పాలి. ఈ సినిమాను కొంచెం పెద్ద స్థాయిలోనే రిలీజ్ చేశారు. ఐతే తమిళంలోనే డివైడ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమాకు ఇక్కడ బ్యాడ్ టాక్ వచ్చింది. అసలే విక్రమ్ ఫాంలో లేకపోవడంతో ఈ సినిమాకు ఓపెనింగ్స్ కూడా పెద్దగా రాలేదు. ఈ సినిమా టాలీవుడ్ బాక్సాఫీస్‌పై పెద్దగా ప్రభావం చూపేలా కనిపించట్లేదు. ఇక ఈ వీకెండ్లో వచ్చిన తెలుగు సినిమాల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. శ్రీకాంత్ హార్రర్ మూవీ ‘రా..రా’ పేలవం అంటున్నారు.

బొత్స అల్లుడి తమ్ముడు రంజిత్ హీరోగా త్రికోటి రూపొందించిన ‘జువ్వ’కు కూడా నెగెటివ్ టాకే వచ్చింది. ఈ సినిమా ఏ రకంగానూ మెప్పించలేదు. ఇక ‘హైదరాబాద్ లవ్ స్టోరీ’.. ‘చల్తే చల్తే’ సినిమాల గురించి మాట్లాడేవాళ్లే కరవయ్యారు. మొత్తంగా ఈ వీకెండ్లో అన్ని సినిమాలూ తేలిపోయినట్లే. ఇది ప్రధానంగా ‘తొలి ప్రేమ’కు కలిసొచ్చే విషయమే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English