ఏపీలోనూ వ‌ర్మ‌పై కేసు బుక్‌

ఏపీలోనూ వ‌ర్మ‌పై కేసు బుక్‌

వివాదాల‌తో స‌హ‌జీవ‌నం చేసే ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు రాంగోపాల్ వ‌ర్మ‌కు వివాదాలంటే మొహ‌మెత్తిపోయేలా ప‌రిణామాలు చోటు చేసుకుంటున్నాయి. గ‌తంలో ఎన్నో వివాదాల‌తో వ‌ర్మ పేరు వినిపించినా.. త‌న‌దే పైచేయిగా వ్య‌వ‌హ‌రించేవాడు. చ‌ట్టం ప‌రిధిలోకి ఎప్పుడూ రాలేదు కూడా.

తాజాగా మాత్రం అందుకు భిన్న‌మైన ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. ఆయ‌న తీసిన జీఎస్టీ చిత్రం పుణ్య‌మా అని.. వ‌ర్మ‌పై ఈ మ‌ధ్య‌నే తెలంగాణ పోలీసులు కేసు న‌మోదు చేయ‌టం.. స‌మ‌న్లు జారీ చేయ‌టం.. అందుకు స్పంద‌న‌గా పోలీసుల విచార‌ణ‌కు హాజ‌రు కావటం తెలిసిందే.

విచార‌ణ‌లో భాగంగా పోలీసులు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు సూటిగా స‌మాధానాలు చెప్ప‌లేద‌ని.. దాట‌వేత ధోర‌ణిని అనుస‌రించిన‌ట్లుగా వార్త‌లు వ‌చ్చాయి. మొత్తంగా కేసు విష‌యంలో వ‌ర్మ డిఫెన్స్ లోప‌డిన‌ట్లుగా వార్త‌లు వ‌చ్చాయి. తెలంగాణ పోలీసులు న‌మోదు చేసిన కేసు నుంచి బ‌య‌ట‌ప‌డేందుకు కిందామీదా ప‌డుతున్న ట్లుగా చెబుతున్నారు. త‌న‌పై న‌మోదైన కేసు నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చేందుకు తెర వెనుక పెద్ద ఎత్తున ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్న‌ట్లుగా ఆరోప‌ణ‌లు వినిపిస్తున్నాయి.

ఇందులో నిజం ఎంత‌న్న‌ది కాలం మాత్ర‌మే తేల్చ‌గ‌ల‌దు. ఇదిలా ఉంటే.. వ‌ర్మ తీసిన జీఎస్టీపై కేసు న‌మోదు చేయాలంటూ ఏపీకి చెందిన మ‌హిళ‌లు కొంద‌రు నిర‌స‌న‌లు వ్య‌క్తం చేస్తున్నారు. ఇందులో భాగంగా విశాఖ‌లో కొన్ని మ‌హిళా సంఘాలు ప్ర‌త్యేకంగా దీక్ష‌ను షురూ చేశాయి. వ‌ర్మ‌పై కేసు న‌మోదు చేయాల‌న్న డిమాండ్ తో నిర‌స‌న చేస్తున‌న మ‌హిళా సంఘాల ఆందోళ‌న‌కు పోలీసులు స్పందించారు.

వ‌ర్మ‌పై విశాఖలోని ఎంవీపీ జోన్ పోలీస్ స్టేష‌న్లో కేసు న‌మోదు చేశారు. సెక్ష‌న్ 504.. 509 కింద కేసులు న‌మోద‌య్యాయి. అయితే.. తెలంగాణ‌లో మాదిరి ఏపీలోనూ వ‌ర్మ‌పై సెక్ష‌న్ 306.. 354 ఏ.. 67 ఐటీ యాక్ట్ కింద కేసులు న‌మోదు చేసిన‌ట్లుగా చెబుతున్నారు.

తాను తీసిన జీఎస్టీ చిత్రానికి సంబంధించి టీవీ చ‌ర్చ‌ల్లో కొంద‌రు మ‌హిళ‌ల్ని ఉద్దేశించి వ‌ర్మ అనుచితంగా మాట్లాడిన‌ట్లుగా ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ఈ నేప‌థ్యంలో వ‌ర్మ‌పై కేసు న‌మోదు చేయాల‌ని చెప్ప‌ట‌మే కాదు.. ఆయ‌న్ను అరెస్ట్ చేయాల‌న్న డిమాండ్ చేస్తున్నారు. వారం వ్య‌వ‌ధిలో వ‌ర్మ‌ను అరెస్ట్ చేయ‌కుంటే మ‌ళ్లీ ఆందోళ‌న‌బాట ప‌డ‌తామ‌ని విశాఖ మ‌హిళ‌లు ప‌లువురు డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణ కేసుల‌తోనే ఉక్కిరిబిక్కిరి అవుతున్న వ‌ర్మ‌కు..ఏపీ కేసు మ‌రెన్ని చికాకులు తెస్తుందో?

ఇదిలా ఉంటే.. హైద‌రాబాద్ లో త‌న‌పై న‌మోదైన కేసు విచార‌ణ‌కు సంబంధించి పోలీసుల ఎదుట ఈ సోమ‌వారం వ‌ర్మ హాజ‌రు కావాల్సి ఉంది. అయిన‌ప్ప‌టికీ ఆయ‌న హాజ‌రు కాలేదు. ఇదిలా ఉంటే తాజాగా త‌న‌కున్న ప‌నుల ఒత్తిడి కార‌ణంగా పోలీసుల విచార‌ణ‌కు హాజ‌రు కాలేన‌ని వ‌ర్మ స‌మాచారం ఇచ్చిన‌ట్లుగా చెబుతున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు