లాభం చేకూరింది మాత్రం ఆ సినిమాకే

లాభం చేకూరింది మాత్రం ఆ సినిమాకే

మహేష్ బాబు.. అల్లు అర్జున్ ల ఫైట్ ఓ కొలిక్కి వచ్చింది. రెండు నెలలకు పైగా వీరిద్దరి సినిమా డేట్ పై తెగ చర్చలు జరిగాయి. వాదోపవాదాలు జరిగాయి.. ఎవరూ వెనక్కి తగ్గలేదు. ఫ్యాన్స్ హంగామా చేసుకున్నారు. ఇండస్ట్రీ జనాలు అందోళన పడ్డారు. అన్నీ జరిగాక ఇప్పుడు తీరిగ్గా సెటిల్మెంట్ చేసుకుని.. ఇద్దరూ ఆ డేట్ వదిలేసుకున్నారు.

ఏప్రిల్ 27వ తేదీని వదిలేసుకుని.. ఓ వారం ముందుగా మహేష్ బాబు.. ఓ వారం లేటుగా అల్లు అర్జున్ రాబోతున్నారు. అయితే.. ఇంతకీ ఈ సెటిల్మెంట్ జరిగిన తీరు బాగానే ఉంది కానీ.. అసలు రజినీకాంత్ మూవీ కాలాకి దారి ఇవ్వడానికే ఈ సెటిల్మెంట్ జరిగిందా అనిపించక మానదు. వీళ్ల చర్చల్లో కానీ.. మాటల్లో కానీ ఎక్కడా రజినీ మూవీ ప్రస్తావన రాకపోయినా.. లాభం చేకూరింది మాత్రం ఆ సినిమాకే. ఎందుకంటే.. ఏప్రిల్ 27ను సోలోగా రాసిచ్చేశారు మరి. ఆఖరిలో ఆ డేట్ ను చెప్పిన చిత్రానికి.. సోలో రిలీజ్ దక్కడం అంటే.. విచిత్రంగానే చెప్పచ్చు.

కాలా మూవీకి తెలుగులో కూడా మంచి ఓపెనింగ్స్ వచ్చే ఛాన్స్ ఉంది. రజినీకాంత్ కి ఇక్కడ స్టార్స్ తో సమానంగా ఓపెనింగ్స్ వరకూ వస్తుంటాయి. సినిమా హిట్ అయితే కలెక్షన్స్ కూడా అదే స్థాయిలో వస్తాయి. ఇప్పుడు ఏప్రిల్ 20న మహేష్ బాబు భరత్ అనే నేను వచ్చి.. ఓ వారానికి కొంత హంగామా తగ్గాక కాలా వస్తాడు. ఆ తర్వాత ఓ వారానికి రెండు సినిమాల హంగామా దాదాపుగా చివరిస్థాయికి వస్తుంది కాబట్టి.. తీరిగ్గా నా పేరు సూర్య అంటూ అల్లు అర్జున్ వచ్చేలా డీల్ సెట్ అయింది. ఈ డీల్ కాలా కోసమే జరిగిందా అనిపించినా ఆశ్చర్యం లేదు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు