సి.కళ్యాణ్.. సినిమాలకు టాటా?

సి.కళ్యాణ్.. సినిమాలకు టాటా?

ఒక్క సినిమా చాలు.. మొత్తం వ్యవహారం తల్లకిందులు అయిపోవడానికి. ‘ఇంటిలిజెంట్’ సినిమా సి.కళ్యాణ్‌ పరిస్థితిని అలాగే చేసిందని సమాచారం. పేరుకు పెద్ద నిర్మాత.. సీనియర్ అన్న మాటే కానీ.. సి.కళ్యాణ్ ఎప్పుడూ కూడా ఇబ్బడి ముబ్బడిగా సినిమాలు తీసింది లేదు. భారీ ప్రాజెక్టులు చేపట్టింది లేదు. ఇంతకుముందు అసలు నిర్మాతగా ఆయన పేరు కూడా పడేది కాదు. వేరే వాళ్ల భాగస్వామ్యంలో సినిమాలు తీయడం.. చిన్నా చితకా సినిమాలపై పెట్టుబడి పెట్టడం.. ఇలా ఉండేది వరస. ఐతే ఈ మధ్య కొంచెం ధైర్యం చేసి సొంతంగా సినిమాలు నిర్మిస్తున్నాడు. క్రేజీ కాంబినేషన్లు సెట్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. ఈ క్రమంలోనే కొంచెం అటు ఇటుగా ఒకేసారి ‘జై సింహా’.. ‘ఇంటిలిజెంట్’ సినిమాలు లైన్లో పెట్టాడు.

నిజానికి ఈ రెండు సినిమాల మీదా ముందు నుంచి పెద్దగా బజ్ ఏమీ లేదు. కానీ కళ్యాణ్ మాత్రం వీటిపై చాలా భరోసాతో ఉన్నాడు. ఈ రెండు సినిమాలు చాలా బాగా ఆడేస్తాయన్న నమ్మకంతో వీటిని సొంతంగా రిలీజ్ చేసే సాహసం కూడా చేశాడు. ‘జై సింహా’ వరకు ఆయన నమ్మకం నిలబడింది. ఈ సినిమా పెట్టుబడిని వెనక్కి తెచ్చి.. ఆయనకు స్వల్పంగా లాభాలు కూడా తెచ్చిపెట్టింది. ఐతే ‘అజ్ఞాతవాసి’ దెబ్బ తినడం, సంక్రాంతి సీజన్ కావడం వల్లే ‘జై సింహా’ ఆ మాత్రం ఆడింది కానీ.. లేకుంటే ఈ సినిమా పరిస్థితి ఎలా ఉండేదో అంచనా వేయడం కష్టమేమీ కాదు.

‘జై సింహా’ ఆడేసరికి మరింత కాన్ఫిడెంటుగా ‘ఇంటిలిజెంట్’ సినిమాను సొంతంగా రిలీజ్ చేశాడు కళ్యాణ్. ఐతే రూ.25 కోట్లకు పైగా పెట్టుబడి పెడితే.. థియేట్రికల్ రన్‌ ద్వారా రూ.5 కోట్లకు అటు ఇటుగా వెనక్కి తెచ్చిందీ సినిమా. దీనికి శాటిలైట్ కావడం కూడా కష్టంగా ఉంది. ఒకవేళ అది ఓకే అయినా.. హిందీ డబ్బింగ్ ద్వారా కొంత మొత్తం వచ్చినా.. కనీసం రూ.15 కోట్ల దాకా అయితే నష్టం తప్పట్లేదని అంచనా. ఇది కళ్యాణ్‌కు మామూలు దెబ్బ కాదు. ఈ దెబ్బకు హైదరాబాద్‌లో తనకున్న ఖరీదైన ఫ్లాట్ అమ్మాల్సిన స్థితికి వచ్చాడట కళ్యాణ్. దీంతో ఇప్పుడే ఆయన కోలుకోలేడని.. సినిమా చేసే పరిస్థితి కూడా లేదని.. ప్రొడక్షన్ కు టాటా చెప్పేసినా ఆశ్చర్యం లేదని అంటున్నారు సన్నిహితులు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు