వారసులు వద్దు అంటున్న జగన్… ?

జగన్ రెండేళ్ల పాలన పూర్తి చేసుకున్నారు. మరో సారి ఏపీలో గెలవాలని చూస్తున్నారు. అయితే ఇపుడున్న పరిస్థితుల్లో ఇలాగే కొనసాగితే వైసీపీ గెలుపు మ‌ళ్లీ అంత సులువు కాద‌న్న మాట ఉంది. 2019 ఎన్నికలు వేరు, ఆ ఊపు వేరు. నాడు జగన్ ని ఒక్కసారి అయినా సీఎంగా చూడాలని జనాలు ఆరాటపడ్డారు. అలాగే పార్టీ మొత్తం జగన్ కోసం కష్టపడింది. ఇపుడు మాత్రం అలాంటి వారావరణం లేదు అనే చెప్పాలి. నిజానికి జగన్ సీఎం అయ్యాక వైసీపీ ఎక్కడ ఉంది ? అన్న ప్రశ్న కూడా వస్తోంది. అలాగే పదవులు కొందరికి దక్కాయి, చాలా మంది ప‌ద‌వుల కోసం వేచి చూస్తున్నారు. దాంతో వారికి కనుక దక్కపోతే తిరుగుబాటలో నడిచే ప్రమాదం కూడా ఉంది. ఇవన్నీ ఇలా ఉంటే జగన్ వచ్చే ఎన్నికల్లో టికెట్లు ఎవరికి ఇస్తారు, ఎవరికి కోత కోస్తారు అన్న చర్చ కూడా ఓ వైపు సాగుతోంది.

ఈసారి సీనియర్లకు మంగళం పాడాలని జగన్ భావిస్తున్నారు అన్న టాక్ అయితే బయటకు వస్తోంది. నోరు విప్పి జగన్ బయటకు చెప్పకపోయినప్పటికీ ఆయన పదవులను పంపిణీ చేస్తున్న తీరుని చూస్తే అది అర్ధం అవుతుంది. అలాగే మంత్రి వర్గం కూర్పు కూడా ఇదే తేటతెల్లం చేస్తోంది. ఇక తిరుపతి లోక్ సభకు ఉప ఎన్నిక జరిగితే జగన్ కొత్త వారికే అవకాశం ఇచ్చారు. అలాగే మంత్రులుగా రేపటి రోజున యువకులు కొత్త వారికి ఛాన్స్ అంటున్నారు. ఇవన్నీ ఆలోచించుకున్నపుడు ఆరు పదులు దాటిన సీనియర్లకు జగన్ ఖ‌చ్చితంగా గుడ్ బై చెప్పేస్తారు అన్న టాక్ గట్టిగా వైసీపీలో వినిపిస్తోంది. దానికి విరుగుడుగా సీనియర్లు కూడా మరో ఆలోచన చేస్తున్నార‌ట.

తమ వయసు అయిపోయింది, తమ సేవలు వద్దు అని జగన్ భావిస్తే తాము స్వచ్చందంగానే తప్పుకుంటామని చెబుతున్నారు. అయితే తమకు బదులుగా తమ వారసులకు టికెట్ ఇవ్వాలని వారు షరతు పెడుతున్నార‌ట. ఇలా కనుక చూసుకుంటే శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకూ చాలా పెద్ద లిస్టే ఉంది. శ్రీకాకుళంలో తమ్మినేని సీతారామ్ కుమారుడు చిరంజీవి నాగ్, ఉప ముఖ్యమంత్రి కొడుకు క్రిష్ణ చైతన్య, ధర్మాన ప్రసాదరావు కుమారుడు రామ్ మనోహర్ నాయుడు, బొత్స సత్యనారాయణ కొడుకు డాక్టర్ సందీప్ వంటి వారున్నారు. వీరందరూ కూడా తమ వారికే టికెట్ ఇవ్వాలని రాయబేరాలు నడుపుతున్నారుట.

అయితే జగన్ ఆలోచనలు మాత్రం వేరేగా ఉన్నాయని అంటున్నారు. సీనియర్లను పక్కన పెట్టి కొత్తవారికి టికెట్లు ఇచ్చి తనకు విధేయులుగా చేసుకోవాలన్నదే ఎత్తుగడ. అలాగే జనాలకు కూడా ఫ్రెష్ లుక్ ఉంటుందని, అపుడే గెలుపు అవకాశాలు ఉంటాయని భావిస్తున్నారుట. మరి ఇలా సీనియర్లకు ఒక్క లెక్కన ఎసరు పెడితే వారంతా ఊరుకుంటారా. వారు కనుక ఎదురు తిరిగితే వైసీపీ నావ మునిగిపోకతప్పదని కూడా అంటున్నారు. మొత్తానికి జగన్ కి సీనియర్లకు మధ్య చిన్న గ్యాప్ అయితే మొద‌లైంద‌నే పార్టీ వ‌ర్గాల భోగ‌ట్టా ?