ప్రభాస్‌కు మళ్లీ పరీక్షే..

ప్రభాస్‌కు మళ్లీ పరీక్షే..

‘బాహుబలి’ సినిమా కోసం ప్రభాస్ పడ్డ కష్టం తెలుగులో మరే హీరో ఇంకే సినిమాకూ పడి ఉండడమో. తెలుగులో గతంలోనూ కొన్ని భారీ సినిమాలు ఏళ్ల తరబడి చిత్రీకరణ జరుపుకున్నాయి కానీ.. ‘బాహుబలి’ అంత భారీగా.. అంత కష్టంతో తెరకెక్కిన సినిమా మరొకటి ఉండదేమో. కెరీర్లో దాదాపు ఐదేళ్ల సమయం ఈ సినిమాకే కేటాయించాడు ప్రభాస్. ఈ సినిమా కోసం యంగ్ రెబల్ స్టార్ ఎంత శారీరక కష్టానికి గురయ్యాడో రాజమౌళి స్వయంగా చాలాసార్లు చెప్పాడు. ఆ కష్టం వల్లే అతడి భుజం దెబ్బ తిని.. శస్త్రచికిత్స చేయించుకోవాల్సిన పరిస్థితి కూడా వచ్చింది.

ఐతే ‘బాహుబలి’ కోసం అంత కష్టపడ్డ ప్రభాస్.. తన తర్వాతి సినిమాను ఈజీగా లాగించేద్దామని చూడలేదు. ‘సాహో’ కూడా భారీ బడ్జెట్‌తో, ఎంతో ఖర్చుతో కూడుకున్న సినిమానే. ఈ చిత్రం కూడా దాదాపు రెండేళ్ల పాటు షూటింగ్ జరుపుకోబోతోంది. ఈ సినిమా మొదలై ఇప్పటికే ఏడాది కావస్తోంది. ఇప్పటిదాకా ఓ మోస్తరు సీన్లే తీస్తూ వచ్చారు. ఇప్పుడు దుబాయిలో మండుటెండల మధ్య 70 రోజుల పాటు నిర్విరామంగా షూటింగ్ చేయడానికి రెడీ అవుతున్నారు. ఇంకో మూడు రోజుల్లో ఆ షెడ్యూల్ మొదలవుతుంది.

నిజానికి మూడు నెలల కిందటే ఈ షెడ్యూల్ అనుకున్నప్పటికీ.. అక్కడ పర్మిషన్లు రాక వాయిదా పడింది. ఇప్పుడు అధిక ఉష్ణోగ్రతల మధ్య భారీ యాక్షన్ సీక్వెన్స్ తీయబోతున్నారు. దీని కోసం ప్రభాస్ ఇప్పటికే నెల రోజుల నుంచి కష్టపడుతున్నాడు. ఎంతో శ్రమకోర్చి అవతారం మార్చుకున్నాడు. ఇప్పుడు షూటింగ్ సందర్భంగా ఎంతో శ్రమ తప్పేట్లు లేదు. సినిమా వల్ల ఎంత డబ్బులొచ్చినా.. ఇంత కమిట్మెంట్‌తో కష్టపడేవాళ్లు తక్కువమందే ఉంటారు. ఈ విషయంలో యంగ్ రెబల్ స్టార్ కమిట్మెంట్‌కు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు