రజినీతో అక్షయ్.. కమల్‌తో అజయ్

రజినీతో అక్షయ్.. కమల్‌తో అజయ్

బాలీవుడ్ నటుల్ని సౌత్ సినిమాల్లో విలన్ పాత్రలకు తీసుకోవడం ఎప్పట్నుంచో ఉన్న సంప్రదాయమే. ఈ మధ్య అక్కడి హీరోలు సౌత్‌లో విలన్ రోల్స్ చేస్తుండటం విశేషం. వివేక్ ఒబెరాయ్ అజిత్ సినిమా ‘వివేగం’లో విలన్ పాత్రలో కనిపించిన సంగతి తెలిసిందే. అలాగే బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్.. సూపర్ స్టార్ రజినీకాంత్ ‘2.0’లో ప్రతినాయక పాత్రలో కనిపించబోతున్నాడు. ఇప్పుడు మరో బాలీవుడ్ స్టార్ సౌత్ మూవీలో విలన్ క్యారెక్టర్ చేయనున్నట్లు సమాచారం. ‘2.0’ తర్వాత శంకర్ ‘భారతీయుడు-2’ తీయనున్న సంగతి తెలిసిందే. త్వరలోనే ఆ చిత్రం సెట్స్ మీదికి వెళ్లనుంది.

ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగన్ కీలక పాత్రలో నటిస్తాడట. అతడిది నెగెటివ్ రోల్ అని అంటున్నారు. అజయ్ నటించబోయే తొలి దక్షిణాది సినిమా ఇదే కావడం విశేషం. రెండు దశాబ్దాల కిందట వచ్చిన ‘భారతీయుడు’ అప్పట్లో ఎంత సంచలనం రేపిందో తెలిసిందే. మళ్లీ ఇన్నేళ్లకు.. అది కూడా కమల్ హాసన్ రాజకీయారంగేట్రం చేస్తున్న తరుణంలో ఈ సినిమాకు సీక్వెల్ తెరకెక్కబోతుండటం ఆసక్తి రేకెత్తించేదే. ఈ చిత్రాన్ని ముందు దిల్ రాజు నిర్మించాల్సి ఉన్నప్పటికీ అనివార్య కారణాల వల్ల ఆయన తప్పుకున్నారు. తమిళంలో మరో పెద్ద నిర్మాత ఈ చిత్రాన్ని టేకప్ చేసినట్లు సమాచారం. ప్రస్తుతం స్క్రిప్టు వర్క్ జరుగుతోంది. ‘2.0’ రిలీజ్ తర్వాత శంకర్ ఈ చిత్రాన్ని మొదలుపెట్టే అవకాశముంది.

 
 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English