పద్మావత్ పై సైలెన్స్.. తూచ్ అదే సపోర్ట్

పద్మావత్ పై సైలెన్స్.. తూచ్ అదే సపోర్ట్

ఏదైనా ఓ సినిమా కానీ.. ఓ సెలబ్రిటీ కానీ వివాదంలో చిక్కకుంటే.. దాని గురించి చిలువలు పలువలుగా కథనాలు వడ్డించడం మీడియాకు అలవాటు అయిపోయింది. అలాగే ఆయా అంశాలపై స్పందించాలంటూ స్టార్లను.. సెలబ్రిటీలను గుచ్చి గుచ్చి అడగడం.. వారు సమాధానం చెబితే ఓ రకంగా.. చెప్పకపోతే ఇంకో రకంగా.. చెప్పిన పాయింట్లను రంధ్రాన్వేషణ చేస్తూ మరో రకంగా హంగామా జరుగుతోంది.

అందుకే కొన్ని విషయాలపై మాట్లాడడం తారలు మానేశారు. రీసెంట్ గా పద్మావత్ చిత్ర వివాదంపై కూడా ఇదే జరిగింది. ఆ చిత్రానికి సపోర్టింగ్ గా ఒక్కరంటే ఒక్కరు కూడా పైకి మాట్లాడని పరిస్థితి కనిపించింది. ఇలా సైలెంట్ గా ఉండడంపై స్పందించాడు బాలీవుడ్ బాద్షా షారూక్ ఖాన్. ఆయా వివాదాలపై స్పందించడం కారణంగానే ఎక్కువగా డ్యామేజ్ జరుగుతోందని అభిప్రాయపడ్డాడు. కాసింత కూడా గుర్తింపు లేనివారు.. వారి మాటకు కనీస మాత్రం విలువ లేని వారి మాటలకు మీడియాలో ఎంతగా ఫోకస్ లభిస్తోందో గుర్తు చేశాడు షారూక్.

పద్మావత్ చిత్ర యూనిట్ కూడా ఈ వివాదంపై ఏ మాత్రం స్పందించని తీరును గుర్తు చేసిన కింగ్ ఖాన్.. సైలెంట్ గా ఉండడం ద్వారానే సపోర్ట్ చేశామని అంటున్నాడు. ఏ చిత్రానికి అయినా తొలి రోజుల్లో లభించే వసూళ్లు చాలా కీలకం అన్న షారూక్.. అనవసరంగా వివాదాలను కొనితెచ్చుకుని.. నిర్మాతలను నష్టపరచడం ఇష్టం ఉండదని అన్నాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English