కండలు.. కాల్పులు.. అంతేనా బాబూ?

కండలు.. కాల్పులు.. అంతేనా బాబూ?

జాకీష్రాఫ్ నట వారసత్వాన్నందుకుని హీరోగా మారిన కుర్రాడు టైగర్ ష్రాఫ్. తొలి సినిమాగా ‘పరుగు’ లాంటి సాఫ్ట్ లవ్ స్టోరీ రీమేక్‌ను ఎంచుకున్నాడతను. ఐతే బాలీవుడ్లోకి వెళ్లేసరికి ఆ కథ స్వరూపం మారిపోయింది. అది యాక్షన్ ప్రధానంగా మారింది. ఆ తర్వాత కూడా టైగర్ చేసిన ప్రతి సినిమా యాక్షన్‌తో నిండిపోయినదే.

టైగర్ కెరీర్లో పెద్ద కమర్షియల్ సక్సెస్‌గా నిలిచిన ‘బాగి’లో పూర్తిగా యాక్షన్, డ్యాన్సులు తప్ప ఏమీ కనిపించవు. ఐతే ఆ సినిమా బాగానే డబ్బులు తెచ్చిపెట్టేసరికి దీనికి సీక్వెల్ తీసేస్తున్నారు. ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ లాంచ్ చేశారు.

కండలు తిరిగి.. సిక్స్ ప్యాక్‌తో ఉన్న తన బాడీని ఎక్స్‌పోజ్ చేస్తూ గన్ను పట్టుకుని నడుచుకొస్తున్న హీరో.. బ్యాగ్రౌండ్లో హెలికాఫ్టర్, బాంబుల విధ్వంసాలు.. ఈ సెటప్ అంతా చూస్తే ఇది భారీ యాక్షన్ సినిమా అనే విషయం అర్థమవుతోంది. ‘బాగి’ తెలుగు సూపర్ హిట్ మూవీ ‘వర్షం’కు రీమేక్ అన్న సంగతి తెలిసిందే. ఐతే మూల కథను మాత్రమే తీసుకుని లవ్ తగ్గించి యాక్షన్‌తో నింపేశారీ సినిమాలో.

రెండో భాగానికి వచ్చేసరికి మరింతగా యాక్షన్ దట్టించినట్లున్నారు. ఐతే టైగర్ ప్రతి సినిమాలోనూ ఈ కండలు.. కాల్పులే ఉంటున్న నేపథ్యంలో కొత్తగా ఈ సినిమాలో ఏం చూపిస్తారో చూడాలి. సాజిద్ నడియాడ్‌వాలా నిర్మాణంలో అహ్మద్ ఖాన్ రూపొందిస్తున్న ‘బాగి-2’ మార్చి 30న ప్రేక్షకుల ముందుకు రానుంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు