అది 11 వేల కోట్లు కాదు..రూ.20వేల కోట్ల స్కాం

అది 11 వేల కోట్లు కాదు..రూ.20వేల కోట్ల స్కాం

పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ)లో జరిగిన భారీ కుంభకోణంపై అనేక ట్విస్టులు తెర‌మీద‌కు వ‌స్తున్నాయి. ఈ స్కాంలో తవ్వుతున్న కొద్దీ అక్రమాలు బట్టబయలు అవుతున్నాయి. ఈ కుంభకోణంలో ప్రధాన సూత్రదారి వజ్రాల వ్యాపారి నీరవ్‌మోడీ మోసాలపై జరుగుతున్న లోతైన దర్యాప్తులో మరిన్ని ఆసక్తిర అంశాలు వెల్లడయ్యాయి. ముందుగా అంచనావేసినట్లు ఈ కుంభకోణం విలువ రూ.11,400 కోట్లు కాదని, అది రూ.20 వేల కోట్లకు చేరే అవకాశం ఉందని బ్యాంకర్లు, ప్రభుత్వ ఉన్నతాధికారులు వెల్లడిస్తున్నారు. గతంలో అంచనావేసినదాంతో పోలిస్తే ఇంచుమించు రెండు రెట్లు పెరుగనున్నదన్న మాట.

నీర‌వ్‌మోడీ కుంభకోణంలో ఇప్పటికే నియంత్రణ మండళ్లు రూ.5,600 కోట్లకు పైగా ఆస్తులను జప్తు చేసినప్పటికీ వీటి విలువ ఇంతటి స్థాయిలో ఉందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వీటిలో వజ్రాలు, బంగారు ఆభరణాలు, ఇతర స్థిర, చర ఆస్తులు కూడా ఉన్నాయి. పీఎన్‌బీతోపాటు ఇతర బ్యాంకులకు కూడా ఈ కుంభకోణం పాకడంతో దర్యాప్తు సంస్థలు వీటిపై ప్రత్యేకంగా దృష్టి సారించాయి. హైదరాబాద్ సహా దేశవ్యాప్తంగా నీరవ్‌మోదీకి సంబంధించిన కంపెనీలు, జ్యువెలరీలు, ఇళ్లు, ఇతర కార్యాలయాల్లో సోదాలు ఐదో రోజు కూడా కొనసాగాయి.

ఇదిలాఉండగా...పీఎన్‌బీలో 300 కోట్ల డాలర్ల మేర కుంభకోణం జరిగిందంటూ ఐటీ శాఖ అంచనాపై ఆర్థిక మంత్రిత్వ శాఖ స్పందించింది. `అదో తప్పుడు వార్త. ఇది వాస్తవానికి దూరంగా ఉంది` అని ట్వీట్టర్ ద్వారా ఆర్థిక మంత్రిత్వ శాఖ వర్గాలు వెల్లడించాయి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు