ఈ సీటును మైనార్టీల‌కు ఫిక్స్ చేసిన బాబు ?

తెలుగుదేశం పార్టీ అన్ని వర్గాలకు సమాన న్యాయం చేస్తుంది అన్న సంగతి తెలిసిందే. అందుకే ఆ పార్టీ తరఫున ఎందరో ముస్లిం నాయకులు ఉంటారు. ఇక ఉత్తరాంధ్రాలో తీసుకుంటే విశాఖలో పెద్ద ఎత్తున్ ముస్లింలు ఉన్నారు. వారిలో మెజార్టీ ముస్లింలు విశాఖ సౌత్ లో ఉన్నారు. ఈ సీటు వారికి ఒక విధంగా కంచుకోట అని చెప్పాలి. గతంలో టీడీపీ విశాఖ వన్ గా ఈ స్థానం ఉన్నపుడు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఎస్ ఎ రహమాన్ ని తెచ్చి ఏకంగా ఎమ్మెల్యేను చేసింది. దాంతో మూడు జిల్లాల్లో మైనారిటీలు పెద్ద ఎత్తున టీడీపీకి దన్నుగా ఉన్నారు. ఈ నియోజ‌క‌వ‌ర్గానికే చెందిన ముస్లిం నేత‌ల‌కు టీడీపీ ప‌లు నామినేటెడ్ ప‌ద‌వులు కూడా ఇచ్చింది.

డాక్టర్ రహమాన్ కి ఆ తరువాత కాలంలో ఉడా చైర్మన్ పదవిని కూడా చంద్రబాబు ఇచ్చారు. ఆయన సుదీర్ఘ కాలం పాటు అర్బన్ జిల్లా టీడీపీ ప్రెసిడెంట్ గా కూడా పనిచేశారు. గ‌తంలో వైసీపీలో ఉన్న ఆయ‌న టీడీపీ అధికారంలోకి వ‌చ్చిన‌ప్పుడు అర్బ‌న్ ప్రెసిడెంట్‌గా ప‌నిచేశారు. అయితే గ‌త ఎన్నికల్లో ఆయ‌న ద‌క్షిణం సీటు ఆశించారు. అయితే చంద్ర‌బాబు మాత్రం సిట్టింగ్ ఎమ్మెల్యేకు ఛాన్స్ ఇవ్వ‌డంతో ఎన్నిక‌ల త‌ర్వాత రెహ్మ‌న్ వైసీపీలోకి వెళ్లిపోయారు. ఇక సిట్టింగ్ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ కి మూడు సార్లు టీడీపీ అవకాశం ఇచ్చింది. ఆయన రెండు సార్లు గెలిచారు. మత్స్యకార సామాజిక వర్గానికి చెందిన ఆయన టీడీపీలోనే ఉంటే 2024లో పార్టీ అధికారంలోకి వస్తే కచ్చితంగా మంత్రి అయ్యేవారు.

అయితే ఆయన వైసీపీలోకి ఫిరాయించారు. దీంతో విశాఖ సౌత్‌లో టీడీపీ కీల‌క నేత‌లుగా ద‌శాబ్దంన్న‌ర కాలంగా ఉన్న రెహ‌మాన్‌, వాసుప‌ల్లి గ‌ణేష్ ఇద్ద‌రూ పార్టీకి దూరం కావడంతో ఇప్పుడు ఇక్క‌డ కొత్త నేత‌ను ఎంపిక చేయాల్సిన అవ‌స‌రం ఉంది. ఏపీలో ఇన్‌చార్జ్‌లు లేకుండా ఖాళీగా ఉన్న నియోజ‌క‌వ‌ర్గాల‌పై దృష్టి పెడుతోన్న బాబు.. ఒక్కో నియోజ‌క‌వ‌ర్గాన్ని సెట్ చేసుకుంటూ వ‌స్తున్నారు. ఈ క్ర‌మంలోనే ఇదే జిల్లాలోని భీమిలికి కూడా కొత్త ఇన్‌చార్జ్‌గా కోరాడ రాజ‌బాబును సెట్ చేశారు. ఇక ఇప్పుడు విశాఖ సౌత్‌పైనే బాబు గురి పెట్టార‌ట‌..!

ఈసారి విశాఖ సౌత్ టికెట్ ని మైనారిటీలకు కేటాయించాలని టీడీపీ అధినాయకత్వం భావిస్తోందిట. ఇక్కడ సీనియర్ మోస్ట్ నేత మహమ్మద్ నజీర్ ఉన్నారు. ఆయన సిట్టింగ్ ఎమ్మెల్యే పార్టీ గీత‌ దాటినా తాను మాత్రం క్యాడర్ కి అండగా ఉంటూ తన వాయిస్ గట్టిగా వినిపిస్తున్నారు. దాంతో విశాఖ సౌత్‌ నుంచి వచ్చే ఎన్నికల్లో ఆయన్ని పోటీకి పెట్టి ఇక్కడ జెండా ఎగరేయాలని టీడీపీ ఆలోచిస్తోంది. న‌గ‌రంలో నాలుగు నియోజ‌క‌వ‌ర్గాల్లో తూర్పులో క‌మ్మ‌, ప‌శ్చిమంలో బీసీ, ఉత్త‌రంలో కాపు నేత‌లు ఉన్నారు. ఇటు గాజువాక‌లో బీసీల్లో బ‌లంగా ఉన్న యాద‌వ‌, పెందుర్తిలో కొప్పు వెల‌మ నేత‌లు ఉన్నారు. దీంతో మైనార్టీల‌కు కూడా ఈ సీటు ఇస్తే ఈక్వేష‌న్లు బ్యాలెన్స్ అవుతాయ‌ని బాబు భావిస్తున్నార‌ట‌.