యువ హీరో కెరియర్‌పై రెడ్‌ ఫ్లాగ్‌

యువ హీరో కెరియర్‌పై రెడ్‌ ఫ్లాగ్‌

స్టార్‌ హీరోలకి నాలుగైదు ఫ్లాప్‌ సినిమాలు పడినా అంత నష్టం వుండదు. ఒకే సినిమాతో మళ్లీ వాళ్లు బౌన్స్‌ బ్యాక్‌ అవగలరు. ఎప్పటికీ స్టాండర్డ్‌గా వుండే ఫాన్‌ బేస్‌ వారికి కొమ్ము కాస్తుంది. ఏళ్ల తరబడి హిట్లు లేని హీరోలు కూడా తిరిగి ఫామ్‌లోకి వచ్చిన దాఖలాలు చాలానే వున్నాయి.

కానీ చిన్న హీరోలు ఎక్కువ సార్లు ఫ్లాప్‌ అయితే అవకాశాలు తగ్గిపోతాయి. మంచి విజయాలు సాధించినా కూడా కనుమరుగు అయిన హీరోలు చాలా మందే వున్నారు. అందుకే చిన్న హీరోలు ఎప్పటికి అప్పుడు తమ కెరియర్‌ని జాగ్రత్తగా ప్లాన్‌ చేసుకుంటూ ఆచి తూచి అడుగులు వేయాలి.

నాని, శర్వానంద్‌ ఎప్పుడూ పెద్ద నిర్మాతల చేతిలోనే తమ సినిమాలు పెట్టడానికి కూడా ఇదే కారణం. నిర్మాత స్ట్రాంగ్‌ అయితే హీరో పని ఈజీ అయిపోతుంది. ఇదంతా ప్లానింగ్‌లో భాగం. ఇలాంటి ప్లానింగ్‌ లేని హీరోలంతా ఎప్పుడో అప్పుడు కనిపించకుండా పోయారు. ఇప్పటికే వరుస ఫ్లాపుల్లో పడి ఇబ్బందులు పడుతోన్న హీరోలు చాలా మందే వున్నారు. మొదట్లో మంచి భవిష్యత్తు వుందని అనిపించుకున్న సందీప్‌ కిషన్‌ కెరియర్‌పై కూడా ప్రస్తుతం రెడ్‌ ఫ్లాగ్‌ ఎగురుతోంది.

మనసుకు నచ్చింది కూడా డిజాస్టర్‌ అవడంతో ఈ యువ హీరోకి ఇక అవకాశాలు ఇచ్చేదెవరనే ప్రశ్న తలెత్తుతోంది. అయిదేళ్ల కాలంగా ఒక్క సరయిన విజయం లేని సందీప్‌ కిషన్‌ ఇప్పుడో అద్భుతమైన సినిమాతో వస్తే తప్ప మళ్లీ నిలదొక్కుకోవడం కష్టమనిపిస్తోంది. మరి ఈ సమస్యని అతను ఎలా అధిగమిస్తాడనేది చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు