మళ్లీ అదే సీన్.. ఇక్కడ హిట్టు..అక్కడ ఫట్టు

మళ్లీ అదే సీన్.. ఇక్కడ హిట్టు..అక్కడ ఫట్టు

హిందీలో ఐదేళ్ల కిందట రిలీజై సూపర్ హిట్టయిన థ్రిల్లర్ సినిమా ‘స్పెషల్ చబ్బీస్’. ఈ చిత్రాన్ని తమిళంలో సూర్య కథానాయకుడిగా యువ దర్శకుడు విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో రీమేక్ చేశారు. తమిళంలో ‘తానా సేంద కూట్టం’ పేరుతో.. తెలుగులో ‘గ్యాంగ్’ పేరుతో రిలీజ్ చేశారీ సినిమాను.

ఒరిజినల్‌ను ఉన్నదున్నట్లు కాపీ కొట్టేయకుండా సౌత్ నేటివిటీకి తగ్గట్లుగా మార్చి బాగానే కష్టపడ్డాడు విఘ్నేష్. సూర్య కూడా తనదైన పెర్ఫామెన్స్‌తో అదరగొట్టాడు. సినిమాకు పాజిటివ్ టాకే వచ్చింది. అందులోనూ సంక్రాంతి సీజన్లో రిలీజైన సినిమా కావడంతో పెద్ద రేంజికి వెళ్తుందని అనుకున్నారు. కానీ ఈ సినిమా ఆశించిన స్థాయిలో వసూళ్లు రాబట్టలేదు.

‘తానా సేంద కూట్టం’ థియేట్రికల్ హక్కుల్ని రూ.62 కోట్లకు అమ్మితే.. ఫుల్ రన్లో ఈ చిత్రం వసూలు చేసిన షేర్ రూ.46 కోట్లు మాత్రమే. ఐతే తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం దాదాపుగా పెట్టుబడిని వెనక్కి తెచ్చింది. రూ.8 కోట్లకు పైగా షేర్.. రూ.13.5 కోట్ల దాకా గ్రాస్ వసూలు చేసిందీ సినిమా. ఇక్కడ ఈ సినిమాను హిట్ అనే చెప్పాలి. కానీ తమిళనాట మాత్రం సినిమా తుస్సుమనిపించింది.

25 శాతం దాకా నష్టాలు తెచ్చిపెట్టింది. ఇంతకుముందు సూర్య సినిమా ‘24’ విషయంలోనూ ఇలాగే జరిగింది. ఆ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో సక్సెస్ ఫుల్ అనిపించుకుంది. తమిళనాట మాత్రం నష్టాలు తెచ్చిపెట్టింది. సూర్యకు తెలుగులో ఉన్న ఫాలోయింగ్‌కి.. అతడి సినిమాల మీద పెట్టుబడికి లెక్క సరిపోతోంది. కానీ సొంతగడ్డ మీదే అతడికి చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు