అంతన్నాదింతన్నాదే మహేష్ అక్క..

అంతన్నాదింతన్నాదే మహేష్ అక్క..

చిన్నా పెద్దా అని తేడా లేకుండా ఏ డైరెక్టర్ అయినా సరే.. తమ సినిమా గురించి తమకు తాముగా డబ్బా కొట్టుకోవడం తక్కువే కనిపిస్తుంది. చిత్ర బృందంలోని మిగతా వాళ్లు సినిమా గురించి గొప్పగా చెప్పినా దర్శకులు మాత్రం చాలా వరకు సైలెంటుగా ఉంటారు. సినిమా తీసింది తామే కాబట్టే తమకు తాముగా గొప్పలు పోతే బాగుండదు. ఎంత గొప్ప సినిమా తీసినా మౌనం పాటిస్తారు. సినిమానే మాట్లాడాలని ఆశిస్తారు. దర్శకులంటేనే ఆలోచనపరులు అనే అభిప్రాయం ఉంటుంది జనాల్లో. వాళ్లు ఎంత తక్కువ మాట్లాడితే అంత బాగుంటుంది. కానీ ‘మనసుకు నచ్చింది’ సినిమాతో దర్శకురాలిగా పరిచయమైన మంజుల మాత్రం ఈ సినిమా గురించి మామూలుగా గొప్పలు పోలేదు.

ఈ సినిమా అద్భుతంగా వచ్చిందని.. తాను గొప్ప సినిమా తీశానని.. ఈ సినిమా నచ్చని వాళ్లంటూ ఉండరని.. అలాంటి వాళ్లు వేస్ట్ ఫెలోస్ అని.. మనసున్న ప్రతి ఒక్కరికీ సినిమా నచ్చేస్తుందని.. విడుదల తర్వాత తాను మోస్ట్ హ్యాపెనింగ్ డైరెక్టర్ కాబోతున్నానని.. రాఘవేంద్రరావును మ్యాచ్ చేసేలా పాటలు తీశానని.. ఛోటా కే నాయుడు సినిమా చూసి అద్భుతం అన్నారని.. సాయిమాధవ్ బుర్రా కూడా పొగిడేశారని.. ఇలా ఎన్నెన్ని మాటలు చెప్పిందో మంజుల విడుదలకు ముందు. కానీ ఇప్పుడు సినిమా గురించి జనాల నుంచి వినిపిస్తున్న వ్యాఖ్యానాలు పూర్తి భిన్నంగా ఉన్నాయి.

 మంజుల సైలెంటుగా ఉండుంటే అయ్యో కృష్ణ కూతురు దర్శకురాలిగా మారి ఏదో తన వల్ల అయినంత కష్టపడిందిలే అన్న ఫీలింగ్ ఉండేది జనాలకు. కానీ ముందు ఆ కామెంట్లు చేయడం వల్ల ఇప్పుడు సినిమాలో విషయం లేకపోయేసరికి సోషల్ మీడియాలో పాత కామెంట్లు గుర్తు చేసి మరీ ట్రోల్ చేస్తున్నారామెను. అంతన్నాడింతన్నాడే అనే పాట గుర్తుకొస్తోంది జనాలకు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు