హారికా వారు నిర్మాత‌ల్ని ఏడిపిస్తున్నారు

హారికా వారు నిర్మాత‌ల్ని ఏడిపిస్తున్నారు

హారికా అండ్ హాసిని క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పై రాధాక్రిష్ణ నిర్మించిన సినిమా అజ్ఞాత‌వాసి. ఈ ఏడాది తొలి భారీ డిజాస్ట‌ర్‌. మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ ఇంత భారీ ఫెయిల్యూర్ ని ఇస్తార‌ని ఎవ‌రూ అనుకోలేదు. ఆ ఫ్లాపు... టాలీవుడ్‌లో ఒక కొత్త ట్రెండ్ దారితీసింది. ఎన్న‌డూ జ‌ర‌గ‌ని వింత చోటు చేసుకుంది. హారిక వారు చేసిన ప‌నితో మిగ‌తా నిర్మాత‌లు తెగ బాధ‌ప‌డుతున్నారు. మేము కూడా అలా చేయాల్సి వ‌స్తుందేమో అని వారి  ఏడుపు.

అజ్ఞాత‌వాసి సినిమాను కొనుక్కున్న బ‌య్య‌ర్లంతా భారీగా న‌ష్ట‌పోయారు. వారికి త్రివిక్ర‌మ్‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్, హారికా బ్యాన‌ర్ నిర్మాత రాధాక్రిష్ణ‌... త‌మ ద‌గ్గ‌ర ఉన్న డ‌బ్బులు పోగేసి 22 కోట్ల దాకా వెన‌క్కి ఇచ్చారట. పూర్తిగా వారిని ఆదుకోక‌పోయినా ఎంతో కొంత ఇవ్వ‌డం వారికి ఉప‌శ‌మ‌నం క‌లిగింది. కాని ఇలా ఇవ్వ‌డం తెలుగు సినిమా చ‌రిత్ర‌లో చాలా రేర్‌. గ‌తంలో ఓసారి వినాయ‌క్ ఓ రెండు కోట్లు వెన‌క్కి ఇచ్చాడు. అంతే త‌ప్ప ఇంత భారీ మొత్తంలో బ‌య్య‌ర్ల‌కు తిరిగి న‌ష్ట‌పోయిన సొమ్మ‌ను చెల్లించ‌డం ఇదే తొలిసారి. ఇప్పుడు ఇత‌ర నిర్మాత‌లకు ఈ ప‌ద్ద‌తి పెద్ద త‌ల‌నొప్పిలా మారింది. ఇప్ప‌టి వ‌ర‌కు బ‌య్య‌ర్ల‌కు తిరిగివ్వ‌డం అనే ప‌ద్ద‌తే లేదు. హారికా వారు చేసిన ప‌నితో రేపు అంద‌రు బ‌య్య‌ర్లు డిమాండ్ చేసే అవకాశం ఉంద‌ని వారి అభిప్రాయం.

రాధాక్రిష్ణ‌లా వెన‌క్కిచ్చే నిర్మాత‌లు చాలా త‌క్కువ‌. అది కూడా ఆయ‌న‌కు కాస్త లాభం వ‌చ్చింది కాబ‌ట్టి, హీరో, ద‌ర్శ‌కులు తిరిగి ఇచ్చిన కొంత సొమ్ముకు, త‌న ద‌గ్గ‌ర ఉన్న డ‌బ్బును క‌లిపి ఇచ్చేశాడు. కానీ అంద‌రూ హీరోలు, ద‌ర్శ‌కులు ఇవ్వ‌రు. అప్పుడు నిర్మాత‌ల ప‌రిస్థితి కుడితిలో ప‌డ్డ ఎల‌క‌లా ఉంటుంది. ఇదే ప‌ద్ద‌తి కొన‌సాగితే... ఏ సినిమానో ఫ్లాపయితే భారీగా సొమ్ము తిరిగి బ‌య్య‌ర్ల‌కు ఇవ్వాల్సి వ‌స్తుంది. అసలు ఇలాంటి స్కీములు ఎందుకు పెడ‌తారంటూ నెత్తికొట్ట‌కుంటున్నార‌ట కొంద‌రు నిర్మాత‌లు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు