మహేష్-బన్నీ.. క్లారిటీ లేకే ఈ కన్ఫ్యూజన్

మహేష్-బన్నీ.. క్లారిటీ లేకే ఈ కన్ఫ్యూజన్

ఏప్రిల్ 27.. ఇప్పుడు మన సినీ ప్రియుల్ని ఉత్కంఠకు గురి చేస్తున్న తేదీ ఇది. ఈ డేటు మీద ఒకటి కాదు.. రెండు కాదు.. మూడు భారీ సినిమాలు కన్నేశాయి. అందులో రెండు తెలుగువైతే.. ఇంకోటి తమిళ డబ్బింగ్ సినిమా. ఈ మూడు సినిమాల నిర్మాతలు ఎవరికి వాళ్లే ఏప్రిల్ 27న తమ సినిమా పక్కా అని ఢంకా భజాయించి చెబుతున్నారు. కానీ ఏది పక్కాగా ఆ తేదీకి వస్తుందన్నదానిపై స్పష్టత లేదు. ఒకవేళ మూడు సినిమాలూ ఆ తేదీకి సిద్ధమైతే ముక్కోణపు పోటీ ఉంటుందా అన్న దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది.

ముందుగా ‘నా పేరు సూర్య’ సినిమాను ఏప్రిల్ 27న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. ఇంతలోనే ‘భరత్ అను నేను’ సినిమాకు కూడా అదే రిలీజ్ డేట్ ప్రకటించారు. ఆ తర్వాత రజినీకాంత్ సినిమా ‘2.0’ అదే తేదీకి షెడ్యూల్ కావడంతో వివాదం రాజుకుంది. కానీ ఆ సినిమా తప్పుకుని ఇప్పుడు ‘కాలా’ ఆ తేదీకి ఫిక్సయింది. దీంతో బన్నీ వెర్సస్ మహేష్ వెర్సస్ రజినీ పోరును చూడబోతున్నామా అని సినీ ప్రేక్షకులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.

నిజానికి ప్రస్తుతానికి ఏప్రిల్ 27న పక్కాగా రిలీజవుతోందనిపిస్తున్నది ‘కాలా’ మాత్రమే. ఎందుకంటే ఆ సినిమా షూటింగ్ కొన్ని నెలల కిందటే పూర్తయింది. రజినీ డబ్బింగ్ కూడా ఎప్పుడో చెప్పేశాడు. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా పూర్తి కావస్తున్నాయి. ఐతే ‘2.0’ విడుదల తేదీని బట్టి దీని రిలీజ్ డిసైడ్ చేద్దామని చూశారు. ఆ సినిమా ఏప్రిల్ నుంచి వాయిదా పడటం ఖాయమని తేలిపోవడంతో దీన్ని అదే నెల 27కు ఫిక్స్ చేశారు.

ఇప్పుడిక ‘నా పేరు సూర్య’.. ‘భరత్ అను నేను’ సినిమాల సంగతే తేలాల్సి ఉంది. ఐతే ఇవి పక్కాగా ఆ తేదీకి రెడీ అవుతాయా లేదా అనే విషయంలో స్పష్టత లేదు. ముందు ఈ రెండు సినిమాల మధ్య క్లాష్ వచ్చినపుడు ఇద్దరు నిర్మాతల మధ్య చర్చలు కూడా జరిగాయి. కానీ తమ సినిమాలు ఎప్పుడు పూర్తవుతాయనే విషయంలో ఇరువురికీ క్లారిటీ లేకపోయింది.

ఇద్దరం ట్రై చేద్దాం.. ఏ సినిమా రెడీ అయితే దాన్ని రిలీజ్ చేద్దాం.. రెండూ రెడీ అయితే అప్పటికి కోఆర్డినేట్ చేసుకుని రిలీజ్ డేట్లు ప్లాన్ చేసుకుందాం అనే అవగాహన కుదిరింది ఇద్దరికీ. ఏప్రిల్ 27 మంచి డేట్ కావడంతో ఎవరికి వాళ్లు సినిమాను పూర్తి చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇంతలో ‘కాలా’ వచ్చి పడింది. ఐతే ఇప్పుడేమీ స్పందించకుండా ముందు పని పూర్తి చేద్దామనే ఆలోచనలో ఉన్నట్లున్నారు ఆ నిర్మాతలు. కాబట్టి మార్చిలో కానీ.. ఏ సినిమా ఎప్పుడనే విషయంలో స్పష్టత రాదేమో.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English