డిజాస్టర్లకు కేరాఫ్ అడ్రస్ అయిపోయిందే

డిజాస్టర్లకు కేరాఫ్ అడ్రస్ అయిపోయిందే

‘అందాల రాక్షసి’ సినిమా ఫలితం ఎలా ఉన్నా.. ఆ సినిమాతో లక్షలాది మంది కుర్రాళ్లు లావణ్య త్రిపాఠి అందానికి దాసులుగా మారిపోయిన మాట వాస్తవం. ‘ఏమాయ చేసావె’లో సమంత తర్వాత తెలుగులో తొలి సినిమాతోనే అంత ప్రభావం చూపిన హీరోయిన్ లావణ్యే అంటే అతిశయోక్తి లేదు. ఎక్స్‌పోజింగ్ జోలికి వెళ్లకుండానే ఆమె కుర్రాళ్లను మంత్రముగ్ధుల్ని చేసింది. ఆ తర్వాత ‘దూసుకెళ్తా’.. ‘సోగ్గాడే చిన్నినాయనా’.. ‘శ్రీరస్తు శుభమస్తు’ లాంటి సినిమాలు లావణ్యకు మంచి ఫలితాన్నందించాయి. వీటి తర్వాత లావణ్య కెరీర్ మరో స్థాయికి వెళ్తుందని అనుకుంటే.. వరుస ఫెయిల్యూర్లతో తిరోగమన బాట పట్టిందీ ఉత్తరాఖండ్ భామ.

గత ఏడాది నుంచి లావణ్యకు అసలేమాత్రం కలిసి రావడం లేదు. ‘మిస్టర్’తో మొదలైన డిజాస్టర్ల పర్వం కొనసాగుతూనే ఉంది. ఆ సినిమా తర్వాత ‘రాధ’ ఆమెకు తీవ్ర నిరాశను మిగిల్చింది. ఆపై ‘యుద్ధం శరణం’ కూడా లావణ్యకు చేదు అనుభవమే అయింది. ‘ఉన్నది ఒకటే జిందగీ’ డిజాస్టర్ కాదు కానీ.. అదీ ఫ్లాపే. పైగా ఆ సినిమాలో లావణ్య పాత్ర.. ఆమె లుక్స్ తీవ్ర విమర్శలకు దారి తీశాయి. ఇప్పుడిక ‘ఇంటిలిజెంట్’తో లావణ్య పరిస్థితి దయనీయంగా తయారైంది. ఈ సినిమా ఏ రకంగానూ ఆమెకు మేలు చేసేది కాదు. ఈ సినిమాతో లావణ్యకు ‘డిజాస్టర్ హీరోయిన్’ అనే ముద్ర బలపడిపోయింది. తమిళంలో అవకాశాలు వచ్చినట్లే వచ్చి ఆగిపోయాయి. తెలుగులో ఇప్పుడు లావణ్యకు అవకాశాలేమీ లేవు. గ్లామర్ కూడా తేడా కొట్టేసిన నేపథ్యంలో ఆమె కెరీర్ దాదాపు క్లోజ్ అయిపోయినట్లే భావించాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English