డైలాగులు దంచేశాడుగా..

డైలాగులు దంచేశాడుగా..

ఈ శనివారం ప్రేక్షకుల ముందుకొచ్చిన ‘తొలి ప్రేమ’ చాలా మంచి టాక్ తెచ్చుకుంది. పవన్ కళ్యాణ్ కెరీర్లో క్లాసిక్ లాగా నిలిచిపోయిన ‘తొలి ప్రేమ’ సినిమా టైటిల్‌ను వరుణ్ తేజ్ సినిమాకు పెట్టినపుడు అందరూ రకరకాల సందేహాలు వ్యక్తం చేశారు. క్రేజ్ కోసం టైటిల్ వాడుకోవడం వరకు ఓకే కానీ.. దీని వల్ల వచ్చే అంచనాల్ని అందుకోలేకపోతే అది సినిమాకు పెద్ద మైనస్ అవుతుందని అన్నారు. ఐతే ఆ ‘తొలి ప్రేమ’ స్థాయిలో లేకపోయినా.. ఈ ‘తొలి ప్రేమ’ ఈ తరం ప్రేక్షకుల్ని బాగానే ఆకట్టుకునేలా తెరకెక్కింది. శుక్రవారం రిలీజైన రెండు సినిమాలకు నెగెటివ్ టాక్ రావడం దీనికి బాగా కలిసొచ్చింది. టాక్ కూడా బాగుండటంతో ఓపెనింగ్స్ అంచనాల్ని మించిపోయాయి.

‘తొలి ప్రేమ’లో మైనస్సులు లేవని కాదు కానీ.. వాటిని మరిపించే ప్లస్ పాయింట్స్ ఇందులో చాలా ఉన్నాయి. నటుడిగా ప్రస్థానం ఆరంభించి దర్శకుడిగా మారిన వెంకీ అట్లూరి తొలి ప్రయత్నంలోనే మంచి అభిరుచి ఉన్న దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. సినిమాలో.. ముఖ్యంగా ప్రథమార్ధంలో అతడి దర్శకత్వ ప్రతిభను చూడొచ్చు. కొత్త దర్శకుడి నుంచి కోరుకునే కొత్తదనం చూపిస్తూనే.. ఏ తడబాటు లేకుండా అనుభవజ్ఞుడిలా సినిమాను తెరకెక్కించాడు. అతను రాసిన సంభాషణలు సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

‘‘మనుషులం కదా.. ప్రేమ గుర్తుండదు. తప్పులు మాత్రమే గుర్తుంటాయి’’ అంటూ ఒక సీన్లో కథానాయిక చెప్పే డైలాగ్ వెంకీ పరిణతికి అద్దం పడుతుంది. ఒక సీన్లో హీరోయిన్ ‘‘నచ్చడం వేరు ప్రేమించడం వేరు’’ అని అంటే.. హీరో బదులుగా ‘‘నచ్చే వరకు రా.. ప్రేమలోకి నేను తీసుకెళ్తా’’ అంటాడు. ఆ సంభాషణకు కొనసాగింపుగానే ‘‘మబ్బులేసిన ప్రతిసారీ వర్షం రాదు’’ అంటుంది. వెంటనే వర్షం పడుతుంది. హీరో అందుకుని.. ‘‘వర్షం పడింది. వర్ష కూడా పడుతుంది’’ అంటాడు. సినిమాలో హీరోయిన్ పేరు వర్ష. దీన్ని బట్టి ఈ డైలాగ్ ఎంత బాగా రాశాడో అర్థం చేసుకోవచ్చు. ఇలా సినిమాలో డైలాగ్ మెరుపులు చాలానే ఉన్నాయి. దర్శకుడిగానే కాక రచయితగానే వెంకీ తనదైన ముద్రే వేశాడు తొలి సినిమాతో.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English