నీ పని నువ్వు చూస్కో.. హీరో సూర్యకు బీజేపీ వార్నింగ్

తమిళ హీరోలకూ, కేంద్రంలోని అధికార పార్టీ బీజేపీకి మధ్య రోజుకో కొత్త వివాదం పుట్టుకొస్తోంది. మొన్నటికి మొన్న హీరో సిద్ధార్థ్, బీజేపీ నేతలకు మధ్య ట్వీట్ వార్ జరిగింది.. ఇప్పుడు హీరో సూర్యతో.. ఇలాంటి వివాదాలే మొదలయ్యాయి. దాదాపు తన పనేంటో తాను చేసుకుంటూ.. ఎవరితోనూ ఎలాంటి వివాదం పెట్టుకోని.. హీరో సూర్యకి బీజేపీ నేతలు వార్నింగ్ ఇవ్వడం ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశమైంది.

సూర్యకి ఎవరితోనూ వివాదాలు లేకపోయినా.. ప్రభుత్వ నిర్ణయాలను మాత్రం అప్పుడప్పుడు ప్రశ్నిస్తూనే ఉంటారు. గతంలో..నీట్ ప‌రీక్ష నిర్వ‌హ‌ణ‌పై కోర్టు నిర్ణ‌యాన్ని త‌ప్పుబ‌ట్టి వార్త‌ల్లోకెక్కారు సూర్యా. తాజాగా కేంద్రం సినిమాటోగ్ర‌ఫి చ‌ట్టం-1952 స‌వ‌రించాలని నిర్ణ‌యం తీసుకోవ‌డాన్ని సినీ ప్ర‌ముఖులు తీవ్రంగా విబేధిస్తుండ‌గా సూర్య కూడా త‌న అభిప్రాయాన్ని వెల్ల‌డించారు.

చ‌ట్టాల్లో స‌వ‌ర‌ణ‌లు భావ ప్ర‌క‌ట‌న స్వేచ్ఛ‌కు మ‌రింత మ‌ద్ద‌తివ్వాలే కానీ.. దానికి సంకెళ్లు వేసేలా ఉండొద్ద‌ని హిత‌వు ప‌లికారు. అయితే ఆయ‌న వ్యాఖ్య‌ల‌పై తమిళనాడు బీజేపీ యువ‌జ‌న విభాగం తీవ్రంగా స్పందించింది.

సూర్య ప‌ని సినిమాల్లో న‌టించ‌డ‌మేన‌ని.. ఆయ‌న దాన్ని చూసుకుంటే బాగుంటుంద‌ని సూచించింది. త‌న‌కు సంబంధం లేని విష‌యాల్లో జోక్యం చేసుకుంటే చూస్తూ ఊరుకోమ‌ని హెచ్చ‌రించింది. సూర్య త‌న‌ తీరు మార్చుకోక‌పోతే ఆయ‌నపై న్యాయ‌ప‌ర‌మైన పోరాటం చేస్తామ‌ని చెప్పింది. అయితే బీజేపీ యువ‌జన విభాగం చేసిన వ్యాఖ్య‌లు అతిగా ఉన్నాయన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఆయ‌న మాట్లాడిన దాంట్లో త‌ప్పేముంద‌ని సోష‌ల్ మీడియాలో నెటిజ‌న్లు ప్ర‌శ్నిస్తున్నారు.