గుంటూరు ఘాటు లెక్క చూపించాడ‌ట‌

గుంటూరు ఘాటు లెక్క చూపించాడ‌ట‌

ఒక్క స్పీచ్ గుంటూరు ఎంపీ గ‌ల్లా జ‌య‌దేవ్ రాజ‌కీయ కెరీర్ ను పూర్తిగా మార్చేసింద‌ని చెప్పాలి. తెలుగులో మాట్లాడ‌టానికి త‌డ‌బ‌డే ఈ పారిశ్రామిక ఎంపీ ఇమేజ్ ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. గుంటూరు అల్లుడి హోదాలో ఎన్నిక‌ల బ‌రిలో నిలిచిన గ‌ల్లాను అక్క‌డి ప్ర‌జ‌లు ఆశీర్వ‌దించి ఢిల్లీకి పంపారు. అమెరికాలో చ‌దువుకొని.. పారిశ్రామిక‌వేత్త‌గా సుప‌రిచితుడైన జ‌య‌దేవ్ కు మొహ‌మాటం ఎక్కువ‌గా చెబుతారు. సిగ్గ‌రిగా ఉంటూ.. రాజ‌కీయాలు ఇంకా వంట‌బ‌ట్ట‌లేదండ‌ని చెప్పే గ‌ల్లా ఇప్పుడు ఏపీ ఫైర్ బ్రాండ్ గా మారారు. చాలామందికైతే ఆయ‌న్ను ఏపీ బాహుబ‌లిగా కీర్తిస్తున్నోళ్లు లేక‌పోలేదు.

ఐదు కోట్ల ఆంధ్రుల కడుపు మంట‌ను ఇప్ప‌టివ‌ర‌కూ ఏపీ నేత ఎవ‌రూ పార్ల‌మెంటు ద‌ద్ద‌రిల్లిపోయేలా చెప్ప‌లేక‌పోయార‌న్న కొర‌త కోత పెట్టేది. తాజాగా ఆయ‌న చేసిన ప్ర‌సంగంతో అది కాస్తా తీరిపోవ‌ట‌మే కాదు.. పార్ల‌మెంటు రికార్డుల్లో ఏపీకి ఎంత అన్యాయం జ‌రిగింద‌న్న విష‌యాన్ని రికార్డుల్లో ఎక్కేలా చేశారు. మోడీ స‌ర్కారుకు వ్య‌తిరేకంగా నాలుగు మాట‌లు మాట్లాడ‌టానికి ఆచితూచి అన్న‌ట్లు వ్య‌వ‌హ‌రిస్తున్న వేళ‌.. ఎలాంటి జంకూ బొంకూ లేకుండా మిస్ట‌ర్ ఫ్రైమ్ మినిస్ట‌ర్‌.. మిస్ట‌ర్ ఫైనాన్స్ మినిస్ట‌ర్ అంటూ గ‌ద్దింపు స్వ‌రంతో ఏపీకి జ‌రుగుతున్న అన్యాయంపై అన‌ర్గ‌ళంగా మాట్లాడిన వైనం ఆంధ్రోళ్ల‌ను మురిసిపోయేలా చేసింది.

మ‌న‌కు జ‌రిగిన అన్యాయాన్ని మ‌నోళ్లు స‌మ‌ర్థంగా చెప్ప‌లేక‌పోతున్నారేన‌న్న వేద‌న‌లో ఉన్న వారికి జ‌య‌దేవ్ స్పీచ్ సాంత్వ‌న క‌లిగించింది.  కొమ్మ‌లు తిరిగిన మొన‌గాళ్లుగా త‌మ‌కు తాము చెప్పుకునే సీనియ‌ర్ నేత‌ల‌కు భిన్నంగా.. తొలిసారి చ‌ట్ట‌స‌భ‌లోకి అడుగుపెట్టిన గ‌ల్లా.. ఏపీకి ఎంత అన్యాయం జ‌రిగింద‌న్న విష‌యాన్ని సూటిగా.. స్ప‌ష్టంగా చెప్పేశార‌ని చెప్పాలి.

ఏం మాట్లాడితే ఏం జ‌రుగుతుందోన‌న్న భ‌యాన్ని వ‌దిలేసి.. కోట్లాదిమంది ఆంధ్రుల మ‌న‌సుల్లో ఉన్న విష‌యాన్ని కుండ‌బ‌ద్ధ‌లు కొట్టిన వైనం ఇప్పుడో హాట్ టాపిక్ గా మారింది.  నిన్న‌మొన్న‌టి వ‌ర‌కూ గ‌ల్లాను లైట్ తీసుకున్న వారు ఇప్పుడు ఆయ‌న గురించి పున‌రాలోచ‌న‌లో ప‌డ్డారు. ఏపీ బాహుబ‌లిగా ప‌లువురు అభివ‌ర్ణిస్తున్న గ‌ల్లా జ‌య‌దేవ్ ప్ర‌సంగంలో హైలెట్ గా ఆయ‌న చివ‌రి మాట‌ల్ని చెబుతున్నారు. చూస్తూ.. కూర్చోవ‌టానికి ఏపీ ప్ర‌జ‌లేమీ ఫూల్స్ కాద‌ని చెప్ప‌టం ద్వారా మోడీ అండ్ కోను ఛ‌ర్నాకోల్‌తో చురుకుపుట్టించార‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. పార్ల‌మెంటు వాయిదా ప‌డిన నేప‌థ్యంలో.. గుంటూరు వ‌స్తున్న గ‌ల్లాకు భారీ ఎత్తున స్వాగ‌త స‌త్కారాలు నిర్వ‌హించాల‌ని భావిస్తున్నారు. ఇంగ్లిషులో అన‌ర్గ‌ళంగా మాట్లాడే ఏపీ నేత ఎవ‌రూ లేర‌న్న కొర‌త‌ను గల్లా జ‌య‌దేవ్ తీర్చేస్తార‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు