వినాయక్.. ఏమైనా ఆశ కనిపిస్తోందా?

వినాయక్.. ఏమైనా ఆశ కనిపిస్తోందా?

స్టార్ డైరెక్టర్లు ఫ్లాపులు.. డిజాస్టర్లు తీయడం కొత్తేమీ కాదు. కొన్నిసార్లు కథ సరిగా లేకో.. మంచి కథను సరిగా తీయలేకో తేడా కొట్టేయడం సహజం. కొన్నిసార్లు చాలా మంచి కథలు.. కొత్త కథలు కూడా దారుణమైన ఫలితాన్నిస్తుంటాయి. ఎంత పెద్ద దర్శకుడికైనా చేదు అనుభవాలు సహజం. రాజమౌళిని మినహాయిస్తే.. ఇప్పుడు తెలుగులో ఉన్న ప్రతి స్టార్ డైరెక్టర్ డిజాస్టర్లు ఎదుర్కొన్న వాడే. చివరికి త్రివిక్రమ్ సైతం ‘అజ్ఞాతవాసి’తో అన్ని రకాలుగా నిరాశ పరిచాడు. గతంలో అతడికి ‘ఖలేజా’ లాంటి డిజాస్టర్ ఉంది. అంతకుముందు సుకుమార్ కెరీర్లో ‘జగడం’.. ‘1 నేనొక్కడినే’ లాంటి డిజాస్టర్లున్నాయి. ఐతే వి.వి.వినాయక్ కొత్త సినిమా ‘ఇంటిలిజెంట్’ను మాత్రం ఈ గాటన కట్టలేం. అతడిని మిగతా దర్శకుల్లో ఒకడిగా భావించలేం.

సుకుమార్, త్రివిక్రమ్ లాంటి డైరెక్టర్లు ఎలాంటి సినిమాలు తీసినా.. మళ్లీ వాళ్లు పుంజుకుంటారని అనిపించింది. ఇంతకుముందు పుంజుకున్నారు కూడా. కానీ ప్రస్తుతం వినాయక్ పరిస్థితి చూస్తుంటే మాత్రం అతను పుంజుకుంటాడన్న ఆశ ఎంతమాత్రం కనిపించలేదు. ‘ఇంటిలిజెంట్’ చూశాక వినాయక్ పూర్తిగా టచ్ కోల్పోయాడని.. అతడి నుంచి ఇక ఏమాత్రం మెరుపులు ఆశించలేమని.. కొత్త కథలు రాసే.. ఎవరైనా రాసినా దాన్ని సరిగా తెరకెక్కించగలిగే నైపుణ్యం వినాయక్ దగ్గర లేదన్నది స్పష్టం. రొటీన్ ీమాస్ కథలైనా.. ఏది వర్కవుట్ అవుతుంది.. ఏది కాదు అని తేల్చే సామర్థ్యం కూడా వినాయక్ కోల్పోయినట్లున్నాడు.

కొత్తదనం అనేది అతడి డిక్షనరీ నుంచి మాయం అయిపోయిందని స్పష్టం అయిపోయింది. ‘ఖైదీ నంబర్ 150’ ఒరిజినల్ డైరెక్టర్ మురుగదాస్ ప్రతిభ.. చిరు రీఎంట్రీ మేనియా వల్ల ఆడింది తప్పితే ఆ సక్సెస్ క్రెడిట్లో వినాయక్ పాత్ర ఎంతమాత్రం లేదని.. దానికి ముందు, తర్వాత తన ట్రాక్ రికార్డు చూస్తే అర్థమైపోతుంది. ముఖ్యంగా ‘ఇంటిలిజెంట్’లో వినాయక్ దర్శకత్వ ప్రతిభ గురించి ఏమని వర్ణించాలి? ఈ సినిమా చూశాక స్టార్ హీరోలు కాదు కదా.. చిన్న స్థాయి హీరోలు సైతం వినాయక్‌తో సినిమా చేయడానికి బెదిరితే ఆశ్చర్యమేమీ లేదు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు