బాక్సాఫీస్‌ను గెలిచేదెవ్వరు?

బాక్సాఫీస్‌ను గెలిచేదెవ్వరు?

ఫిబ్రవరి అంటే మామూలుగా అన్ సీజన్‌గా పరిగణిస్తారు. అయినప్పటికీ ఈ నెలలో సినిమాల సందడికి కొదవేమీ ఉండేలా లేదు. తొలి వారంలో రెండు సినిమాలొస్తే.. ఈ వారం ఒకేసారి మూడు సినిమాలు థియేటర్లలోకి దిగుతున్నాయి. శుక్రవారం రెండు.. శనివారం ఒక సినిమా విడుదలవుతోంది. ఈ మూడు సినిమాలూ ఆసక్తి రేకెత్తిస్తున్నవే. వేటికవే డిఫరెంట్ జానర్లలో తెరకెక్కిన సినిమాలు కావడం వీటి ప్రత్యేకత.

ముందుగా సక్సెస్‌కు ముఖం వాచిపోయిన ఇద్దరు హీరోలు శుక్రవారం రేసులోకి దిగుతున్నారు. వారిలో ఒకరు సీనియర్ హీరో మోహన్ బాబు అయితే.. ఇంకొకరు యువ కథానాయకుడు సాయిధరమ్ తేజ్. మోహన్ బాబు గత కొన్నేళ్లలో సినిమాలు బాగా తగ్గించేశారు. ఆయన కథానాయకుడిగా హిట్టు కొట్టి చాలా ఏళ్లయిపోయింది. చివరగా చేసిన ‘మామ మంచు అల్లుడు కంచు’ దారుణ ఫలితాన్నిందించింది. ఐతే అందులో కామెడీ చేసి ఫెయిలైన మోహన్ బాబు.. ఈసారి తన స్థాయికి తగ్గ సీరియస్ పాత్రలతో వస్తున్నాడు. ఆయన ‘గాయత్రి’లో ద్విపాత్రాభినయం చేయడం విశేషం. వరుస ఫెయిల్యూర్లలో ఉన్న దర్శకుడు మదన్‌కు కూడా ఈ సినిమా కీలకమే.

ఇక వరుసగా నాలుగు ఫ్లాపులు తిన్న సాయిధరమ్‌ తేజ్‌ ‘ఇంటిలిజెంట్’ మీద బోలెడు ఆశలతో ఉన్నాడు. ఇది తేడా కొడితే అతడి కెరీరే ప్రమాదంలో పడుతుంది. తన ఖాతాలోకి చేరని ‘ఖైదీ నంబర్ 150’ సక్సెస్ తర్వాత వి.వి.వినాయక్‌ రూపొందించిన ‘ఇంటిలిజెంట్’ ఆయన కెరీర్‌కూ కీలకమే. ‘ఖైదీ’ని మినహాయిస్తే వినాయక్ కెరీర్లోనూ చాలా ఏళ్లుగా హిట్లు లేవు. మరి తేజు-వినాయక్‌లకు ‘ఇంటిలిజెంట్’ ఎలాంటి ఫలితాన్నిస్తుందో చూడాలి.

ఇక శేఖర్ కమ్ముల పుణ్యమా అని ‘ఫిదా’తో కెరీర్లో ఒక బ్లాక్ బస్టర్ కొట్టిన వరుణ్ తేజ్.. ‘తొలి ప్రేమ’తో సక్సెస్ ఊపును ఏమాత్రం కొనసాగిస్తాడో చూడాలి. ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం కానున్న వెంకీ అట్లూరికి ఈ సినిమా పరీక్షే. శనివారం రాబోతున్న ఈ చిత్రంపై మిగతా రెండు సినిమాలతో పోలిస్తే అంచనాలు కొంచెం ఎక్కువే ఉన్నాయి. మరి ఈ మూడు సినిమాల్లో బాక్సాఫీస్‌ను గెలిచే సినిమా ఏదో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు