పాపం.. ఆ హీరోయిన్

పాపం.. ఆ హీరోయిన్

అందం ఉంది. అభినయానికీ ఢోకా లేదు. ఒక స్టార్ హీరోయిన్ కాగల లక్షణాలు అన్నీ ఉన్నాయి. కానీ ఆమెకు అదృష్టం కలిసి రావడం లేదు. చేసినవి చిన్న సినిమాలు. పైగా అవి ఫ్లాపయ్యాయి. దీంతో ఐరెన్ లెగ్ అని ముద్ర పడిపోయిందా అమ్మాయికి. దీంతో కెరీర్ అయోమయ స్థితికి చేరుకుంది. ఈ ఉపోద్ఘాతమంతా చాందిని చౌదరి గురించే.

తెలుగు హీరోయిన్లకు గ్లామర్ ఎక్కడ? గ్లామర్ ఉన్నవాళ్లు ఎక్కడ వస్తున్నారు అనే వాళ్లకు సమాధానంగా చాందినిని చూపించొచ్చు. నటన పరంగానూ ఆమె తక్కువేమీ కాదు. సినిమాల్లో అంత మంచి ఫలితాలందుకోలేదు కానీ.. యూట్యూబ్‌లో షార్ట్ ఫిలిమ్స్ చూసేవాళ్లకు చాందిని గురించి పరిచయం అక్కర్లేదు.

యూట్యూబ్‌లో సూపర్ సక్సెస్ అయిన ‘మధురం’ మొదలుకుని పది దాకా షార్ట్ ఫిలిమ్స్ చేసింది చాందిని. ఆమెకు ఇక్కడ లక్షల మంది ఫాలోవర్లున్నారు. సోషల్ మీడియాలో కూడా బాగానే ఫేమస్ చాందిని. కానీ సినిమాల్లో మాత్రం చాందినికి కలిసి రాలేదు. ‘కేటుగాడు’ అని.. ‘కుందనపు బొమ్మ’ అని పెద్దగా పేరు లేని సినిమాలు చేసింది. అవి వచ్చింది తెలియదు. వెళ్లింది తెలియదు. మధ్యలో ‘బ్రహ్మోత్సవం’లో ఒక చిన్న పాత్ర చేసింది. దాని ఫలితమేంటో తెలిసిందే.

తాజాగా ‘హౌరా బ్రిడ్జి’లో నటించిందీ అమ్మాయి. ఈ సినిమాలో ఆమె అందం, అభినయం ఆకట్టుకున్నాయి కానీ.. సినిమా నిలబడలేదు. దీంతో చాందిని కెరీర్ ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్లుగా తయారైంది. ఇక ఆమె ఆశలన్నీ ‘మను’ మీదే ఉన్నాయి. చాందినితో ‘మధురం’ షార్ట్ ఫిలిం తీసిన నరేంద్ర ఫణిశెట్టి ఈ చిత్రాన్ని రూపొందించాడు. బ్రహ్మానందం తనయుడు గౌతమ్ కథానాయకుడిగా నటించిన చిత్రమిది. ప్రోమోల్లో కొత్తగా అనిపిస్తున్న ఈ చిత్రమైనా చాందనికి సక్సెస్ ఇస్తుందేమో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు