చంద్ర‌బాబు జైలుకు వెళ్తే... టీడీపీకి భారీ మెజార్టీ

చంద్ర‌బాబు జైలుకు వెళ్తే... టీడీపీకి భారీ మెజార్టీ

మాట‌ల తూటాలు పేల్చే కాంగ్రెస్ నేత‌ ఉండ‌వ‌ల్లి అరుణ్ కుమార్ మ‌రోసారి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. మోడీ కేసుల్లో ఇరికిస్తాడేమో అని చంద్ర‌బాబు భ‌య‌ప‌డుతున్నార‌ని అంద‌రూ అంటున్నారు. అదే నిజ‌మైతే బాబు భ‌య‌ప‌డాల్సిన ప‌నిలేదు. చంద్ర‌బాబు జైలుకు వెళ్తే న‌ష్టం మోడీకే. ప్ర‌జ‌ల‌కు సానుభూతి ఎక్కువ‌. టీడీపీని భారీ మెజార్టీతో గెలిపిస్తారు.  జైలుకెళ్ల‌డం ఈ కాలంలో త‌ప్పు లేదు.

ఇంకో విష‌యం ఏంటంటే... అస‌లు ఓటుకు నోటు కేసులో భ‌య‌ప‌డాల్సిన ప‌నే లేదు. జైలుకు వెళ్లేంత పెద్ద త‌ప్పు చంద్ర‌బాబు చేయ‌లేద‌ని ఆయ‌న సూత్రీక‌రించారు. ఒకవేళ కేంద్రం చంద్ర‌బాబు మీద క‌క్ష సాధిద్దామ‌ని ప్ర‌య‌త్నిస్తే అది చంద్ర‌బాబుకే మేలు చేస్తుంది గాని నష్టం క‌ల‌గ‌ద‌న్నారు. అస‌లు ఈ స‌మ‌యంలో క‌నుక చంద్ర‌బాబును జైలుకు పంపితే టీడీపీ అతి భారీ మెజార్టీతో మ‌ళ్లీ అధికారంలోకి వ‌స్తుంద‌ని, కాబ‌ట్టి చంద్ర‌బాబు జైలుకు వెళ్తే మంచిదే అని ఉండ‌వ‌ల్లి వ్యాఖ్యానించారు.

జ‌గ‌న్ చ‌రిత్ర గ‌మ‌నిస్తే.... జైలుకు వెళ్ల‌డం వ‌ల్ల ఎంత లాభ‌మో చంద్ర‌బాబుకు అర్థ‌మ‌వుతుంద‌ని అన్నారు. జ‌గ‌న్ జైలుకు వెళ్ల‌డం వ‌ల్ల ఆ పార్టీ క్లీన్ స్వీప్ చేసింద‌ని, ఈ కాలంలో జైలుకు వెళ్లి వ‌చ్చిన వారికి ప్ర‌జ‌ల్లో మంచి ఆద‌ర‌ణ ఉంద‌ని లాలూ నుంచి క‌నిమొళి వ‌ర‌కు ఇది ప్రూవ్ అయింద‌ని, చంద్ర‌బాబు ఎదురొడ్డి పోరాడి అవ‌స‌ర‌మైతే జైలుకు వెళ్ల‌డానికి అయినా రెడీ కావాల‌న్నారు. తద్వారా తెలుగుదేశం తిరుగులేని శ‌క్తిగా ఎదుగుతుంద‌న్నారు.

లోక్‌స‌భ‌లో మోడీ మెజార్టీ భారీగా ప‌డిపోయింది. ఆయ‌న‌కు సొంత మెజారిటీ లేద‌న్నారు. రాజస్థాన్ లో ఈ మ‌ధ్య‌నే రెండు కోల్పోయాక వారికి ఉన్న సీట్లు ఇపుడు కేవ‌లం 280 మాత్ర‌మే. ఇంకా ఎదురుతిర‌గ‌డానికి చాలామంది వేచి చూస్తున్నార‌ని ఉండ‌వ‌ల్లి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. స‌రిగ్గా ఆలోచిస్తే ఉండ‌వ‌ల్లి చెప్పింది నిజ‌మే అనిపిస్తుంది.