ఔరా.. 100 మిలియన్ డాలర్ల కలెక్షన్లా?

ఔరా.. 100 మిలియన్ డాలర్ల కలెక్షన్లా?

అమెరికాలో ఒక భారతీయ సినిమా మిలియన్ డాలర్ల వసూళ్లు రాబడితేనే గొప్పగా చెప్పుకుంటూ ఉంటాం. కానీ ఇప్పుడు మన ఇండియన్ సినిమానే ఒక దేశంలో 100 మిలియన్ డాలర్ల వసూళ్లు కొల్లగొట్టింది. ఆ సినిమా మరేదో కాదు.. మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్ ఓ ముఖ్య పాత్ర పోషిస్తూ.. స్వీయ నిర్మాణంలో తెరకెక్కించిన ‘సీక్రెట్ సూపర్ స్టార్’.

రెండు వారాల కిందట ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం చైనాలో ఇప్పటిదాకా 100.86 మిలియన్ డాలర్లు వసూలు చేసింది. ఇండియన్ కరెన్సీలో చెప్పాలంటే ఆ మొత్తం 649.4 కోట్లు కావడం విశేషం. ‘దంగల్’ తర్వాత అమీర్ ఖాన్ సినిమా చైనాలో 100 మిలియన్ డాలర్ల మార్కును అందుకోవడం ఇది రెండోసారి.

తొలి వారాంతంలోనే 200 కోట్లకు పైగా వసూళ్లు కొల్లగొట్టిన ఈ చిత్రం.. ఆ తర్వాత కూడా అదే జోరును కొనసాగించింది. వీక్ డేస్‌లో సైతం అనూహ్యమైన వసూళ్లతో సంచలనం సృష్టించింది. కేవలం రెండు వారాల్లో 100 మిలియన్ మార్కును అందుకుని ఆశ్చర్యపరిచింది. మూడో వీకెండ్లో కూడా ఈ చిత్రానికి చెప్పుకోదగ్గ వసూళ్లే వచ్చేలా ఉన్నాయి. మరి దీని ప్రస్థానం ఎక్కడిదాకా వెళ్తుందో చూడాలి. అమీర్ దగ్గర మేనేజర్‌గా పని చేసిన అద్వైత్ చందన్ కేవలం రూ.24 కోట్ల బడ్జెట్లో ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. ‘దంగల్’లో అమీర్ కూతురిగా నటించిన జైరా వసీం ఇందులో లీడ్ రోల్ చేసింది. తన సంగీతాభిరుచిని నెరవేర్చుకోవడానికి ఇంట్లో అడ్డంకులున్న నేపథ్యంలో ఒక యూట్యూబ్ ఛానెల్ ద్వారా తనేంటో రుజువు చేసుకునే స్కూల్ అమ్మాయి కథ ఇది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు