అనసూయకు మద్దతుగా రష్మి దిగింది

అనసూయకు మద్దతుగా రష్మి దిగింది

సెల్ఫీ తీసుకోవడానికి వచ్చిన ఒక పిల్లాడి ఫోన్ విసిరి కొట్టిందన్న ఆరోపణలతో నిన్నట్నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది యాంకర్ కమ్ యాక్ట్రెస్ అనసూయ. ఈ విషయమై సోషల్ మీడియాలో గట్టిగా ట్రోలింగ్ జరగడంతో ఆమె ట్విట్టర్, ఫేస్ బుక్ వదిలేసి వెళ్లిపోయే పరిస్థితి వచ్చింది. అనసూయ తన వాదన ఎంత గట్టిగా వినిపించినప్పటికీ.. ఆమె చేసింది తప్పే అన్న అభిప్రాయాలు మెజారిటీ జనాల్లో వ్యక్తమవుతున్నాయి. ఐతే అనసూయ స్నేహితురాలు, తనతో పాటే జబర్దస్త్‌ కార్యక్రమంలో యాంకరింగ్ చేసే రష్మి గౌతమ్ ఆమెకు మద్దతుగా నిలిచింది. ఆమె చేసిన తప్పేంటని ప్రశ్నించింది.

అనసూయ మీ ఫ్రెండ్ కదా.. ఇలా ప్రవర్తించొద్దని మీరైనా సలహా ఇవ్వొచ్చు కదా అంటూ చాలామంది తనకు మెసేజ్‌లు పెడుతున్నారని.. అనసూయ నిజంగానే తనకు క్లోజ్ ఫ్రెండ్ అని.. ఆమె గురించి తనకు బాగా తెలుసని రష్మి చెప్పింది. అనసూయ చాలా మంచిది కాబట్టి ఎవరు ఫొటోలు, సెల్ఫీలు అడిగినా ఓపిగ్గా వాళ్ల కోరికను మన్నిస్తుందని.. కానీ తాను అనసూయ టైపు కాదని.. ఫొటోలడిగితే రూడ్‌గా వ్యవహరిస్తుంటానని రష్మి చెప్పింది. అసలు పిల్లల చేతికి ఫోన్లు ఇచ్చి వాళ్లను సెల్ఫీలు దిగమని తల్లిదండ్రులు ఎందుకు చెబుతారని ఆమె ప్రశ్నించింది.

కొందరు పెద్దవాళ్లు తాము నేరుగా అడగలేక ఇలా పిల్లల్ని ఫొటోల కోసం పంపిస్తారని.. నిజానికి ఆ పిల్లలకు సెల్ఫీలంటే ఏంటో కూడా తెలియదని ఆమె అంది. రోజూ చాలామంది సెల్ఫీల కోసం ఇలా వెంటపడుతుంటారని.. ఒక సందర్భంగా అర్ధరాత్రి తన కారు వెనుక ఇద్దరు కుర్రాళ్లు ఫాలో అయ్యారని.. చివరికి వాళ్లకు బుద్ధి చెబుదామని దిగితే.. సెల్ఫీ దిగితే వెళ్లిపోతామంటూ బెదిరింపు స్వరంతో అడిగారని.. అదే సమయంలో పోలీస్ వ్యాన్ రావడంతో తాను సేఫ్ అయ్యానని రష్మి చెప్పింది. సెలబ్రెటీలకు కొంచెం ప్రైవసీ ఇవ్వాలని ఆమె విజ్ఞప్తి చేసింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English