వర్మ ఆ లోకం నుంచి బయటికి వచ్చాడు

వర్మ ఆ లోకం నుంచి బయటికి వచ్చాడు

‘గాడ్ సెక్స్ అండ్ ట్రూత్’ పేరుతో దాదాపు నెల రోజులుగా రామ్ గోపాల్ వర్మ చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. మియా మాల్కోవా అనే పోర్న్ స్టార్‌తో వర్మ తీసిన ఈ సినిమా కాని సినిమా పెద్ద వివాదానికే దారి తీసింది. దీనికి సంబంధించిన చర్చలతో.. వాదోపవాదాలతో తాను అనుకున్న ప్రయోజనం బాగానే పొందాడు వర్మ.

ఐతే ఈ చర్చల సమయంలో అక్కినేని నాగార్జున అభిమానుల ఆందోళన అంతా ఇంతా కాదు. చివరికి పోర్న్ స్టార్‌ను పెట్టి న్యూడ్ సినిమా చేసే స్థాయికి చేరిన వర్మ.. నాగార్జునతో ఎలాంటి సినిమా తీస్తాడో అని వాళ్లందరూ కంగారు పడ్డారు. ప్రారంభోత్సవం సమయంలో చర్చల్లో ఉన్న నాగ్-వర్మ సినిమా ఆ తర్వాత అసలు వార్తల్లోనే లేకుండా పోయింది.

ఐతే ‘జీఎస్టీ’ పనంతా అయ్యాక ఇప్పుడు వర్మ మళ్లీ నాగ్ సినిమాను వార్తల్లోకి తీసుకొచ్చాడు. ఈ సినిమా నుంచి నిన్న ఒక కొత్త స్టిల్ రిలీజైంది. అందులో నాగార్జున ఓ చిన్న అమ్మాయిని పక్కన పెట్టుకుని గన్నుతో కాలుస్తున్నాడు. ఇందులో నాగ్ లుక్ డిఫరెంట్‌గా ఉంది. ఈ పిక్ షేర్ చేస్తూ ముంబయిలో ఈ చిత్ర షూటింగ్ జరుగుతున్నట్లు వెల్లడించాడు నాగ్. దీనిపై వర్మ స్పందిస్తూ.. తన కెరీర్‌ను నాగార్జునే కిక్ స్టార్ట్ చేశాడని.. ఐతే ఇన్నేళ్ల తర్వాత మళ్లీ తనకు రెండో ‘కిక్’ అవసరమైందని అన్నాడు.

అంతటితో ఆగకుండా నాగార్జునతో తాను ఇప్పుడు హిట్టివ్వకపోతే అతడి అభిమానులు తనను తన్నడం ఖాయమని.. కాబట్టి నాగ్ సినిమాలో విలన్ల కోసం తన్నులు దాచుకుంటే.. అతడి అభిమానులు తన కోసం తన్నులు ఉంచుకుంటారని వర్మ వ్యాఖ్యానించడం విశేషం. మొత్తానికి ‘జీఎస్టీ’ మాయలోంచి వర్మ మామూలు లోకంలోకి రావడం పట్ల నాగ్ ఫ్యాన్స్ సంతోషంగా ఉన్నారిప్పుడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు