ఆమెకు పెళ్లయిందని ఆయన ఏడ్చారట

ఆమెకు పెళ్లయిందని ఆయన ఏడ్చారట

90ల్లో దేశాన్ని ఒక ఊపు ఊపేసిన హీరోయిన్ మాధురీ దీక్షిత్. అప్పట్లో ఆమే దేశంలో నంబర్ వన్ హీరోయిన్. సామాన్య ప్రేక్షకుల్లోనే కాదు.. సెలబ్రెటీల్లోనూ ఆమెకు వీరాభిమానులు చాలామందే ఉన్నారు. నేను మాధురీ ఫ్యాన్ అని రణబీర్ కపూర్, ఐశ్వర్యారాయ్, కరిష్మా కపూర్, కత్రినా కైఫ్, మనీషా కొయిరాలా లాంటి సినీ తారలు ఎన్నోసార్లు చెప్పుకున్నారు.

ఈ జాబితాలో లెజెండరీ బ్యాడ్మింటన్ ప్లేయర్, దీపికా పదుకొనే తండ్రి ప్రకాశ్ పదుకొనే కూడా ఉన్నారట. ఎప్పుడూ మీడియా ముందు పెద్దగా మాట్లాడని ప్రకాశ్ గురించి ఒక సీక్రెట్ ఆయన తనయురాలు దీపికా ఒక కార్యక్రమంలో వెల్లడించింది.

మాధురీ దీక్షిత్‌కు తన తండ్రి వీరాభిమాని అని.. మాధురికి పెళ్లి అయినపుడు ఆయన చాలా బాధపడ్డారని దీపిక తెలిపింది. ఆ బాధ ఏ స్థాయిలోనిదంటే.. మాధురి పెళ్లి గురించి మీడియాలో వార్త చూడగానే ఆయన బాత్రూంలోకి వెళ్లి డోర్ లాక్ చేసుకున్నాడట. కాసేపటి తర్వాత ఆయన బయటికి రాగా.. కళ్లు వాచిపోయి ఉన్నాయని.. దాన్ని బట్టే ఆయన లోపల ఏడ్చారని అర్థమైందని దీపిక వెల్లడించింది.

ఇప్పటికీ ఆ సంఘటన గుర్తు చేసుకుని ఫ్యామిలీ మెంబర్స్ అందరం నవ్వుకుంటూ ఉంటారని.. మాధురికి తన తండ్రి అంతటి వీరాభిమాని అని దీపిక వెల్లడించింది. ఓ కార్యక్రమంలో మాధురి పక్కన ఉండగానే దీపిక ఈ విషయం వెల్లడించడం విశేషం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు