దాసరి కొడుక్కి ఇండస్ట్రీ అండ

దాసరి కొడుక్కి ఇండస్ట్రీ అండ

తెలుగులో హీరోలు, నిర్మాతలు, దర్శకుల వారసత్వాన్నందుకుని ఎంతోమంది స్థిరపడ్డారు. ఐతే తెలుగు సినీ చరిత్రలోనే దర్శకుడిగా ఎవరూ అందుకోని శిఖరాల్ని అందుకున్న దాసరి నారాయణ రావు మాత్రం తన కొడుకు అరుణ్ కుమార్‌ను హీరోగా నిలబెట్టలేకపోయాడు. తొలి సినిమా ‘గ్రీకు వీరుడు’ దగ్గర్నుంచి అరుణ్ చాలా ప్రయత్నాలే చేశాడు. ఏవీ సఫలం కాలేదు. ఒక దశలో ఇక సినిమాలు మానేసి ఇంటిపట్టున ఉండిపోయాడు అరుణ్. అతడిని అందరూ మరిచిపోయారు. తన కొడుకును హీరోగా నిలబెట్టలేకపోవడంపై దాసరి బతికుండగా కొన్నిసార్లు ఇంటర్వ్యూల్లో ఆవేదన చెందారు కూడా. దాసరి చనిపోయాక మోహన్ బాబు సైతం ఒకసారి ఈ విషయం ప్రస్తావించాడు.

ఐతే దాసరి ఉండగా అవకాశాలు లేని అరుణ్.. ఇప్పుడు నెమ్మదిగా ఇండస్ట్రీలో బిజీ అవుతుండటం విశేషం. ఈ మధ్యే వచ్చిన ‘ఒక్క క్షణం’ సినిమాలో అరుణ్ కుమారే విలన్. ఆ పాత్ర బాగానే చేశాడు అరుణ్. ఇప్పుడతడికి మరో క్రేజీ సినిమాలో ఛాన్స్ దక్కింది. అక్కినేని నాగచైతన్య హీరోగా మారుతి రూపొందిస్తున్న ‘శైలజారెడ్డి అల్లుడు’ సినిమాలో అరుణ్ ఓ కీలక పాత్ర పోషిస్తున్నాడు.

ఈ సినిమా తన కెరీర్‌ను మలుపు తిప్పుతుందని అరుణ్ భావిస్తున్నాడు. అరుణ్ మరో సినిమాలోనూ నటిస్తున్నాడిప్పుడు. ఇంతకుముందు హీరోగానే ట్రై చేసి ఫెయిలైన అరుణ్.. ఇప్పుడు క్యారెక్టర్ రోల్స్ చేయడానికి రెడీగా ఉన్నాడు. దాసరి మీద అభిమానం, గౌరవంతో అతడికి ఫిలిం మేకర్స్ అవకాశాలిస్తే కెరీర్ నిలదొక్కుకునే అవకాశముంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు