పద్మావత్ అయిపోయింది.. ఇక ఆ సినిమా

పద్మావత్ అయిపోయింది.. ఇక ఆ సినిమా

పద్మావత్.. గత కొన్నేళ్లలో ఇండియాలో ఇంత వివాదాస్పదమైన సినిమా మరొకటి లేదు. విడుదలకు ముందు ఈ చిత్రం ఎన్నెన్ని అడ్డంకులు ఎదుర్కొందో తెలిసింది. రిలీజ్ తర్వాత కూడా దీనికి తలనొప్పులు తప్పలేదు. చివరికి అన్ని అడ్డంకుల్నీ అధిగమించి ఈ చిత్రం విజయవంతమైంది. ఐతే ఇప్పుడు మరో బాలీవుడ్ సినిమాకు తలనొప్పులు మొదలయ్యాయి. ‘పద్మావత్’ తరహాలోనే అది కూడా చారిత్రక నేపథ్యంలో తెరకెక్కుతున్న సినిమానే. ఆ సినిమా మరేదో కాదు.. మన క్రిష్ డైరెక్ట్ చేస్తున్న ‘మణికర్ణిక’. ఈ చిత్రానికి వ్యతిరేకంగా ఆందోళనలు మొదలయ్యాయి.

వీర నారి ఝాన్సీ లక్ష్మీభాయి జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న సినిమా ‘మణికర్ణిక’. ఐతే ‘పద్మావత్’ను కర్ణిసేన వ్యతిరేకించినట్లే.. ఈ చిత్రం పట్ల సర్వ బ్రాహ్మిన్ మహాసభ వాళ్లు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ సభ అధ్యక్షుడు ప్రెస్ మీట్ పెట్టి మరీ ‘మణికర్ణిక’పై తమ వ్యతిరేకతను ప్రకటించాడు. ఈ సినిమాలో ఝాన్సీ లక్ష్మీభాయి.. ఓ బ్రిటిష్ వ్యక్తితో ప్రేమాయణం నడిపినట్లు చూపిస్తున్నట్లు తమకు తెలిసిందని.. ఇది తమకు తీవ్ర అభ్యంతరకరమని ఆయన అన్నారు.

ఝాన్సీ లక్ష్మీభాయి వ్యక్తిత్వాన్ని దెబ్బ తీసేలా సినిమా తీస్తున్నారని.. చరిత్రను వక్రీకరిస్తే తాము ఊరుకోమని అతనన్నాడు. ఐతే ‘పద్మావత్’ సినిమా చూడకుండానే దాన్ని వ్యతిరేకించి నానా గొడవ చేసిన కర్ణిసేన.. చివరికి రిలీజ్ తర్వాత యు టర్న్ తీసుకుంది. తమ గొప్పదనాన్ని చాటి చెప్పే సినిమా ఇది అన్నారు. మరి ‘మణికర్ణిక’ విషయంలోనూ ఇలాంటి తప్పటడుగే వేస్తున్నారా?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు