థియేటర్ల కబ్జాపై మోహన్ బాబు మాట్లాడాడు

థియేటర్ల కబ్జాపై మోహన్ బాబు మాట్లాడాడు

ఆ ‘నలుగురు’ అంటూ తెలుగు సినీ పరిశ్రమలో తరచుగా ఒక మాట వినిపిస్తూ ఉంటుంది. నలుగురు పెద్ద నిర్మాతలు.. చాలా వరకు థియేటర్లను తమ గుప్పెట్లో పెట్టుకుని ఇండస్ట్రీని శాసిస్తున్నారని.. చిన్న-మీడియం రేంజి సినిమాలకు థియేటర్లు దొరక్కుండా చేస్తున్నారని ఎప్పట్నుంచో ఆరోపణలు ఉన్నాయి.

దీనిపై ఎంతో మంది గళమెత్తారు. తన కొత్త సినిమా ‘గాయత్రి’ ప్రమోషన్లలో భాగంగా ఒక టీవీ ఛానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చిన మోహన్ బాబు దగ్గర ఈ విషయం చర్చకు వచ్చింది. ఇండస్ట్రీలో నలుగురు నిర్మాతలు థియేటర్లను గుప్పెట్లో ఉంచుకున్న మాట వాస్తవమే అని ఆయన అన్నారు. కానీ ఈ విషయంలో ఎవరూ ఏమీ చేయలేరని ఆయన తేల్చేశారు.

థియేటర్లను అదుపులో పెట్టుకున్నవాళ్లు నిర్మాతల్ని ఇబ్బంది పెడుతున్న మాట వాస్తవమే అని.. కానీ ఇండస్ట్రీలో ఎవరికి వారే అన్నట్లు ఉంటున్నారని.. ఏ సమస్య మీదా ఉమ్మడిగా పోరాటం చేసే పరిస్థితి లేదని అన్నారు. థియేటర్ల సమస్య మీద అవసరమైతే తాను పోరాడటానికి సిద్ధమని.. కానీ తాను పోరాడతానంటే వెనక వచ్చి నిలబడే వాళ్లెందరని ఆయన ప్రశ్నించారు.

ముందు సరే అనే వాళ్లు ఆ తర్వాత కనిపించరని.. ఏదైనా మాట్లాడితే అందరి దగ్గరా తాను చెడ్డవాడిని అయిపోతానని.. అందుకే శత్రువుల్ని తయారు చేసుకోవడం ఇష్టం లేక తాను మౌనంగా ఉంటున్నానని మోహన్ బాబు అన్నారు. ఇది భయం కాదని.. ఎవరినీ చెడ్డ చేసుకోవడం ఇష్టం లేక మౌనంగా ఉంటున్నానని మోహన్ బాబు అన్నారు. తన గురువు దాసరి నారాయణరావు ఉన్నపుడు ఇలాంటి సమస్యల్ని నెత్తిన వేసుకుని పోరాడేవారని.. ఆయనలా ఇంకెవ్వరూ చేయలేరని మోహన్ బాబు తేల్చేశారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు