డ్రగ్స్ కేసుపై నా పిల్లలతో మాట్లాడా-మోహన్ బాబు

డ్రగ్స్ కేసుపై నా పిల్లలతో మాట్లాడా-మోహన్ బాబు

టాలీవుడ్‌ను కుదిపేసిన డ్రగ్స్ కేసు గురించి సీనియర్ నటుడు మోహన్ బాబు ఒక ఇంటర్వ్యూలో స్పందించారు. ఈ కేసులో తన పిల్లల గురించి కూడా ఆరోపణలు వినిపించాయని ఆయన అన్నారు. కానీ తన పిల్లలు ముగ్గురూ ఎట్టి పరిస్థితుల్లోనూ వాటి జోలికి వెళ్లరని.. వాళ్లు ఏ తప్పూ చేయలేదని ఆయన అన్నారు. డ్రగ్స్ కేసు వెలుగులోకి వచ్చినపుడు కొందరు తన పిల్లల విషయం ప్రస్తావించారని.. వెంటనే వాళ్లను పిలిచి తాను మాట్లాడానని మోహన్ బాబు చెప్పారు. తాను తన పిల్లల్ని క్రమశిక్షణతో పెంచానని.. వాళ్లు ఎప్పుడూ తప్పు చేయరని మోహన్ బాబు అన్నారు.

ఇక తాను సెట్లో ఆర్టిస్టులపై చేయి చేసుకుంటాననే ప్రచారం గురించి మోహన్ బాబు స్పందించారు. తనకు కోపం ఎక్కువని.. తప్పు చేస్తే.. చెప్పిన సమయానికి షూటింగుకి రాకపోతే కోపం నషాళానికి అంటుతుందనే విషయం వాస్తవమే అన్నారు. ఐతే కావాలని ఎవరి మీదా చేయి చేసుకోలేదని.. అప్పట్లో శిల్పా శివానంద్ మీద చేయి చేసుకున్నాననే మాట కూడా అవాస్తవమని ఆయన అన్నారు.

షూటింగుకి సరిగా రానందుకు తాను ఆమెను మందలించిన మాట వాస్తవమని.. కానీ కొట్టలేదని మోహన్ బాబు స్పష్టం చేశారు. తన కొత్త సినిమా ‘గాయత్రి’ కోసం తాను ఎంతో కష్టపడ్డానని.. ఈ సినిమాలో వచ్చే మూడు ఫైట్లలో తాను ఎలా చూశానో చూడమని.. నిజానికి ఈ సినిమాలో ఒక్క ఫైట్ చాలని.. ఈ వయసులో మీరు కష్టపడగలరా అని విష్ణు ఎగతాళిగా మాట్లాడాడని.. కానీ ముందు తాను చేశాక నచ్చకపోతే అప్పుడు మాట్లాడాలని చెప్పి.. పర్ఫెక్టుగా ఆ ఫైట్లు పూర్తి చేశానని మోహన్ బాబు అన్నారు.


 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు