ఆ సీన్ చేస్తూ బ్రహ్మానందం కష్టాలు

ఆ సీన్ చేస్తూ బ్రహ్మానందం కష్టాలు

మూడు దశాబ్దాలకు పైగా కెరీర్.. వెయ్యికి పైగా సినిమాలు.. ఎన్నో కామెడీ క్యారెక్టర్లు.. కడుపు చెక్కలయ్యేలా నవ్వించిన ఎన్నెన్నో సీన్లు.. ఇలా బ్రహ్మానందం గురించి చెప్పుకుంటూ పోతే చాలానే ఉంది. కెరీర్ ఆరంభంలో బ్రహ్మి లెజెండరీ కామెడీ డైరెక్టర్ జంధ్యాల దర్శకత్వంలో చేసిన ప్రతి సినిమాలోనూ ఆయన క్యారెక్టర్లు భలే పేలాయి.

‘వివాహ భోజనంబు’ సినిమాలో సుత్తి వీరభద్రరావు-బ్రహ్మానందం కాంబినేషన్లో వచ్చిన సన్నివేశాలు ఇప్పుడు చూసుకున్నా నవ్వాపుకోవడం కష్టం. అందులో బ్రహ్మిని ఇసుకలో పూడ్చి పెట్టి హైదరాబాదు.. సికింద్రాబాదు.. ఆదిలాబాదు.. అంటూ సుత్తి వాయించేసే సీన్ అయితే మామూలుగా పేలలేదు.

అంత నవ్వించే ఆ సీన్ తనకు మాత్రం చుక్కలు చూపించిందంటూ ఒక ఇంటర్వ్యూలో ఆ అనుభవం పంచుకున్నారు బ్రహ్మానందం. ఇలాంటి సీన్లు తీసినపుడు నిజంగా ఆర్టిస్టును పాతి పెట్టకుండా చెక్క పెట్టెలో నిలబెట్టి చుట్టూ మట్టి పేరుస్తుంటారని.. కానీ ఆ రోజు మాత్రం అలాంటి ఏర్పాట్లేమీ చేయకుండా నిజంగానే తనను ఇసుకలో గొంతు వరకు పూడ్చి పెట్టారని బ్రహ్మి వెల్లడించాడు. ఆ సమయానికే అటుగా ఓ కుక్క వస్తే.. దాన్ని చూసి అప్పటికప్పుడు ‘ఏ ఊర కుక్కయినా దగ్గరికొచ్చి కాలెత్తితే జన్మ పావనమైపోతుంది మహాప్రభో’ అనే డైలాగ్ జంధ్యాల రాసినట్లు బ్రహ్మి చెప్పాడు.

కాళ్లూ చేతులు కదపకుండా కేవలం ముఖ కవళికలతో హావభావాలు పలికించడం అంత సులువు కాదని.. పైగా ఆ సీన్ మిట్ట మధ్యాహ్నం తీశారని.. దురద పెట్టుకున్నా గోక్కోలేక ఇబ్బంది పడ్డానని బ్రహ్మి తెలిపాడు. ఆ సీన్ అయ్యాక యూనిట్ సభ్యులందరూ తనను వదిలేసి ఎవరి మానానా వాళ్లు వెళ్లిపోయారని.. తర్వాత తాను గట్టిగా అరిస్తే వచ్చి బయటికి తీశారని చెప్పాడు బ్రహ్మానందం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు