క‌ర్ణిసేన క‌ళ్లు తెరిచింది... మ‌రి???

క‌ర్ణిసేన క‌ళ్లు తెరిచింది... మ‌రి???

ప‌ద్మావ‌త్ సినిమాను చిక్కుల్లో ప‌డేసింది క‌ర్ణిసేన‌నే. రాజపుత్రుల సంఘ‌మైన క‌ర్ణిసేన‌... క‌నీసం సినిమా దేని గురించి తీస్తున్నారో... అందులో క‌థ ఎలా ఉండ‌బోతోందో... ఏమీ తెలుసుకోకుండానే... ర‌చ్చ‌ర‌చ్చ చేశారు. ప‌ద్మావ‌తి సినిమా పేరు మారేలా, విడుద‌ల ఆల‌స్య‌మ‌య్యేలా... చాలా ర‌కాలుగా హింసించారు. తీరా ఇప్పుడు సినిమా చూశాక కూల్ గా... అబ్బ‌బ్బా ఏం తీశారు సినిమా... రాజ‌పుత్రులను చాలా గ‌ర్వంగా చూపించారు అంటూ పొగుడుతున్నారు. పొగిడేస్తే స‌రి పోతుందా... చేసిన న‌ష్టం త‌క్కువా ఏమిటి? మ‌రి చేసిన వినాశ‌నానికి స‌మాధానం చెప్ప‌రా? దీపిక మ‌న‌సుకు అయిన గాయాల సంగతి తేల్చ‌రా?

ప‌ద్మావ‌తి సినిమా షూటింగ్ మొద‌లైన‌ప్ప‌టి నుంచి క‌ర్ణిసేన స‌భ్యులు రెచ్చిపోయారు. జైపూర్‌లో ఓ కోట‌లో షూటింగ్ అవుతుంటే... దాడి చేసి సామ‌గ్రి మొత్తం బూడిద చేశారు. సంజ‌య్ లీలా భ‌న్సాలీ జుట్టు పీకి, చెంప‌లు వాయించారు. దీంతో ఆ సినిమా షూటింగ్ కొన్నాళ్లు వాయిదా ప‌డింది. మ‌ళ్లీ మ‌రో చోట షూటింగ్ ఏర్పాటు చేస్తే... అక్క‌డ కూడా రాత్రికి రాత్రి షూటింగ్ సామానంతా నాశ‌నం చేశారు. ఆ త‌రువాత దీపికను చంప‌మంటూ ప‌రోక్షంగా రెచ్చ‌గొట్టారు. ఆమె ముక్కు, త‌ల తీసుకురండి కోట్లిస్తాం అంటూ ప్ర‌క‌ట‌న‌లు చేశారు. ఆడ‌పిల్ల అనే ద‌య, గౌర‌వం లేకుండా ప్ర‌వ‌ర్తించారు. సినిమా విడుద‌ల‌ను అడ్డుకునేందుకు శ‌తవిధాలా ప్ర‌య‌త్నించారు. చివ‌ర‌కు సుప్రీం కోర్టు జోక్యంతో సినిమా కొన్ని రాష్ట్రాల్లో విడుద‌లైంది. గుజ‌రాత్‌, మ‌ధ్య ప్ర‌దేశ్‌, రాజ‌స్థాన్ రాష్ట్రాల్లో సినిమా విడుద‌ల‌ను ఆపేశాయి రాష్ట్ర ప్ర‌భుత్వాలు. నిర‌స‌న‌ల్లో భాగంలో కోట్ల విలువైన ప్ర‌భుత్వ ఆస్తుల‌ను త‌గుల బెట్టారు. ఇంత వినాశ‌నం  చేసి... ఇప్పుడు సినిమా సూప‌ర్ అనేస్తే స‌రిపోతుందా??

క‌ర్ణిసేన నాయ‌క‌త్వం కొంత‌మంది స‌భ్యుల‌ను సినిమాను చూడ‌మ‌ని ఆదేశించింది. అనంత‌రం వారు సినిమాతో రాజ‌పుత్రుల గౌర‌వం మ‌రింత పెరుగుతుంద‌ని చెప్పారు. చాలా బాగా తీశార‌ని ప్ర‌శంసించారు. అంతేకాదు అన్ని రాష్ట్రాల్లో కూడా ప‌ద్మావ‌త్ విడుద‌ల‌య్యేందుకు స‌హ‌కారం అందిస్తామ‌ని చెప్పారు. అంతే త‌ప్ప మేము త‌ప్పు చేశాం, తొంద‌ర‌ప‌డ్డాం, ప్రైవేటు, ప్ర‌భుత్వ ఆస్తుల‌కు న‌ష్ట‌క‌లిగించాం అని మాత్రం నోరువిప్పి చెప్ప‌డంలేదు. వీరి గురించి సంజ‌య్ లీలా భ‌న్సాలీ ఏం స్పందింస్తాడో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు