లేడీ డిటెక్టివ్ అరెస్టు... క‌ష్టాల్లో త్రిష

లేడీ డిటెక్టివ్ అరెస్టు... క‌ష్టాల్లో త్రిష

త్రిష తెలుగును వీడి వెళ్లినా... త‌మిళ‌, మ‌ల‌యాళంలో బాగానే అవ‌కాశాలు ద‌క్కించుకుంటుంది. త‌మిళంలో తాజాగా ఆమెకు మంచి అవ‌కాశ‌మే త‌లుపు త‌ట్టింది. తొలిసారి డిటెక్టివ్ గా న‌టించ‌బోతోంది. అది కూడా రియ‌ల్ క‌థ‌లో. కానీ ఆ సినిమా స‌మ‌స్య‌ల్లో ఇరుక్కున్న‌ట్టే క‌నిపిస్తోంది. ఆ స‌మ‌స్య కూడా వ‌చ్చింది త్రిష వ‌ల్ల కాదు... ఆ రియ‌ల్ డిటెక్టివ్ వ‌ల్ల‌.

ర‌జినీ పండిట్... దేశంలోనే తొలి మ‌హిళా డిటెక్టివ్‌. ఒక పోలీసాఫీస‌ర్ కూతురు. త‌న కెరీర్‌లో ఆమె వంద‌ల కేసుల‌ను ప‌రిష్క‌రించింది. ఆమె క‌థ ఎంద‌రిలో స్పూర్తినిచ్చింది. తొలి లేడీ డిటెక్టివ్ అంటూ మీడియా ఆకాశానికెత్తేసింది. ఆమె జీవిత క‌థ ఆధారంగానే, ఆమె ప‌రిష్క‌రించిన కేసుల ఆధారంగానే త‌మిళంలో ఓ సినిమా తీయ‌బోతున్నారు. అందులో ర‌జిని పండిట్ గా న‌టించేది త్రిష‌నే. నిన్న త్రిష మాట్లాడుతూ... డిటెక్టివ్ గా క‌నిపించ‌డానికి గ్రౌండ్ వ‌ర్క్ మొదలుపెట్టేశాన‌ని, చాలా ఎక్స‌యింటింగ్ గా ఫీల‌వుతున్నాన‌ని చెప్పింది. ఆమె ఇలా చెప్పి గంట‌లు గ‌డిచాయో లేదు... రియ‌ల్ రజినీ పండిట్ అరెస్ట‌యిపోయారు.

ర‌జినీ పండిట్ అక్ర‌మంగా ప్రైవేటు వ్య‌క్తుల కాల్‌ రికార్డుల‌ను తెప్పించుకుంటున్నార‌ని పోలీసుల‌కు ఉప్పందింది. అందుకు త‌గ్గ సాక్ష్యాలు కూడా సేక‌రించి మ‌రీ ఆమెను అరెస్టు చేశారు. ప్రైవేటు వ్య‌క్తుల కాల్ రికార్డులు వారికి తెలియ‌కుండా తీయ‌డం చ‌ట్ట‌రీత్యా నేరమ‌ని చెబుతున్నారు పోలీసులు. అలా ఈమె అయిదుగురి క‌న్నా ఎక్కువ మంది కాల్ డేటాను కొంత‌మందికి డ‌బ్బిచ్చి కొన్న‌ట్టు ఆధారాలున్నాయంటున్నారు పోలీసులు. మొత్త‌మ్మీద‌... ర‌జినీ పండిట్ క‌థ‌లో పెద్ద మ‌లుపే ఇది.

మ‌రి త్రిష చేయ‌బోయే సినిమాలో ఈ మ‌లుపును చూపిస్తారా లేక సినిమా కొన్నాళ్ల పాటూ ఆపేస్తారో... నిర్ణ‌యం తీసుకోవాల్సింది ద‌ర్శ‌క నిర్మాత‌లే.  

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English