గురువు ఫెయిల్.. శిష్యుడు సక్సెస్

గురువు ఫెయిల్.. శిష్యుడు సక్సెస్

టాలీవుడ్లో ఒక విచిత్రమైన సెంటిమెంటుంది. స్టార్ డైరెక్టర్ల శిష్యులు అంతగా సక్సెస్ కాలేరని. రాజమౌళి.. పూరి జగన్నాథ్.. సుకుమార్.. వి.వి.వినాయక్ లాంటి పెద్ద డైరెక్టర్ల దగ్గర పని చేసి వచ్చి దర్శకులుగా అరంగేట్రం చేసిన వాళ్లలో చాలామంది ఫెయిలయ్యారు. ఐతే ఇప్పుడు ఈ సెంటిమెంటును వెంకీ కుడుముల బ్రేక్ చేశాడు. అతను త్రివిక్రమ్ శ్రీనివాస్ శిష్యుడు.

త్రివిక్రమ్ దశాబ్దంన్నర నుంచి దర్శకుడిగా కొనసాగుతున్నాడు కానీ అతడి శిష్యుడు దర్శకుడు కావడం వెంకీ కుడుములతోనే జరిగింది. అతను నాగశౌర్య కథానాయకుడిగా ‘ఛలో’ సినిమాను రూపొందించాడు. గురువులాగే మంచి చమత్కారం చూపించి తొలి సినిమాతో సక్సెస్ కొట్టేశాడు వెంకీ.

త్రివిక్రమ్ తన కెరీర్లోనే ఎన్నడూ లేని విధంగా ‘అజ్ఞాతవాసి’తో దారుణమైన డిజాస్టర్ అందుకున్నాడు. అదే సమయంలోనే త్రివిక్రమ్ శిష్యుడు వెంకీ ‘ఛలో’తో హిట్టు కొట్టడం విశేషమే. నిజానికి వెంకీ త్రివిక్రమ్ దగ్గర మరీ ఎక్కువ రోజులేమీ పని చేయలేదు. ఒక్క ‘అఆ’ సినిమాకు మాత్రమే పూర్తి స్థాయిలో వర్క్ చేశాడు. ‘అజ్ఞాతవాసి’కి కూడా పని చేయాలనుకున్నాడు కానీ.. అంతలోనే ‘ఛలో’ తీసే ఛాన్సొచ్చింది.

ఈ సినిమాలో త్రివిక్రమ్‌ను అనుకరించలేదు కానీ.. త్రివిక్రమ్ లాగే సెన్సాఫ్ హ్యూమర్ మాత్రం చూపించాడు వెంకీ. చాన్నాళ్ల తర్వాత తెలుగులో కడుపుబ్బ నవ్వించిన సినిమాగా ‘ఛలో’ పేరు తెచ్చుకుంది. ఒకవైపు కామెడీ రాయడంలో.. తీయడంలో తిరుగులేని వాడిగా పేరున్న త్రివిక్రమ్ ఆ విషయంలో పూర్తిగా నిరాశ పరిచిన సమయంలోనే అతడి శిష్యుడు ఇలా నవ్వుల్లో ముంచెత్తడమే చిత్రం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు